భారీ వర్షాలు.. పిడుగులు.. ఇసుక తుపాను
50 మందికిపైగా మృతి పెద్ద ఎత్తున పంట నష్టం
అహ్మదాబాద్/భోపాల్/జైపూర్: రాజస్థాన్, మ ధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో మంగళవారం రాత్రికిరాత్రి కురిసిన భారీ వానలు, పిడుగులు, ఇసుక తుపానుకు 50 మందికిపైగా చనిపోయా రని, ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారని అధికారులు బుధవారం చెప్పారు. వానలకు మధ్యప్రదేశ్‌లో 15 మంది చనిపోగా, గుజరాత్‌లో 10 మంది, రాజస్థాన్‌లో అత్యధికంగా 21 మంది చనిపోయారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మంగళవారం రాత్రి పిడుగుపాటుకు 71 ఏళ్ల వృద్ధురా లు, 32 ఏళ్ల వ్యక్తి, ఓ గుడిపూజారి మరణించారు. ఈ అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పశుసంపద కూడా గణనీయంగా దెబ్బతింది. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్, శ్రీగంగానగర్, అజ్మీర్, కోట, పిలానీ ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఇసుక తుపాను సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డట్లు అధికారులు తెలిపారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తర గుజరాత్‌లోని సబర్కంతా జిల్లా లో ఉన్న హిమ్మత్‌నగర్ పట్టణంలో ప్రధాని మోడీ పర్యటన కోసం వేసిన టెంట్లు ఇసుక తుపాను కారణంగా కూలిపోయాయి. ఉధృతంగా వీచిన గాలులకు పలు చోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాజస్థాన్‌లోనైతే గంటకు 60 కిమీ. వేగం తో ఈదురు గాలులు వీచాయి. ఉద్ధృతంగా వీచే గాలులతోపాటు వానలు కురియడంతో రాజస్థాన్‌లో 10 మంద చనిపోయారని జైపూర్‌లో సీనియ ర్ అధికారులు చెప్పారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ‘ఝలావర్‌లో నలుగురు, బరన్, ఉదయ్‌పూర్‌లలో ఒక్కొక్కరు, జైపూర్‌లో అనేక మంది చనిపోయారు’ అని రిలీఫ్ సెక్రటరీ అశుతోష్ ఎటి పెడ్నేకర్ తెలిపారు. గుజరాత్‌లో వానలకు అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని ట్విట్టర్ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సాయం ప్రకటించారు. ప్రధాని ఇలా ప్రకటించిన వెంటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రధాని కేవలం తన సొంత రాష్ట్రం గురించే కలత చెందుతున్నారని విమర్శించారు.‘మోడీజీ, మీరు దేశానికి ప్రధాని. గుజరాత్‌కు మాత్రమే ప్రధాని కాదు. మధ్యప్రదేశ్‌లో కూడా అకాల వర్షానికి, తుపానుకు, పిడుగులకు 10 మందికిపైగా చనిపోయారు. కానీ మీరు గుజరాత్‌లో చనిపోయిన వారి గురించి మాత్రమే చింత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ(మధ్యప్రదేశ్‌లో) మీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలు ఇక్కడ కూడా నివసిస్తున్నారు’ అని కమల్ నాథ్ టీట్‌లో మోడీని ఘాటుగా విమర్శించారు. కాగా వానలు, తుపానుకు కలిగిన నష్టంపై కమల్‌నాథ్ రాజకీయం చేస్తున్నారని బిజెపి ప్రతి విమర్శ చేసింది. ‘రాజకీయం చేయడానికి బదులు ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని, సాయం కోరాలని కమల్‌నాథ్ బాగానే తెలుసు. కానీ ఆయన తన ట్వీట్‌ల ద్వారా రాజకీయం చేస్తున్నారు’ అంటూ రాజ్యసభ సభ్యుడు, బిజెపి మీడియా అధిపతి అనిల్ బలూని ఢిల్లీలో అన్నారు.
ఆ తర్వాత ప్రధాని కార్యాలయం ‘మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ తదితర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు, ఇసుక తుపానులకు అనేక మంది చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ బాధని వ్యక్తంచేశారు. ప్రభావితమైన ప్రజలకు అన్ని విధాల సాయపడేందుకు ప్రభుత్వం తన శక్తివంచనలేకుండా కృషి చేస్తోంది. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. మరో ట్వీట్‌లో ప్రధాని కార్యాలయం అకాల వరాలకు, తుపానులకు చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రధాని జాతీయ విపత్తు నిధి నుంచి తాతాలిక సాయం అందిస్తానని తెలిపింది. ఇదిలావుండగా అకాల వర్షాలు, తుపానులకు గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాల్లో 50 మంది చనిపోయారని, దీనిపై రాజకీయ పార్టీలు రాజకీయం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చెప్పారు. బాధితులకు వీలైతే సహాయ హస్తం అందించాలన్నారు. కమల్‌నాథ్ చేసిన విమర్శల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.