దళితవాడ సమస్యలను తెలుసుకోనున్న కెసిఆర్
130 మందితో రైతు వేదికలో సమావేశం
గ్రామాన్ని అష్టగ్బంధనం చేసిన పోలీసులు
ప్రజాపక్షం/యాదాద్రి ప్రతినిధి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామం వాసాలమర్రిలో బుధవారం రెండవసారి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకోనున్నారు. కెసిఆర్ రాక సందర్భంగా మం గళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భువనగిరి జోన్ డిసిపి కె.నారాయణరెడ్డి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత నెల 10న సిఎం కెసిఆర్ ఈ గ్రామానికి రావాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా వాయిదా వేసుకున్నారు. కాగా జూన్ 22న సిఎం కెసిఆర్ వాసాలమర్రికి వచ్చి గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం అందరం సమష్టిగా కృషి చేయాలని కర్తవ్యబోధన చేశారు. మరో 20 రోజుల్లో గ్రామానికి వచ్చి తాను స్వయంగా దళిత కాలనీల్లో పర్యటిస్తానని చెప్పిన విషయం విదితమే. హుజురాబాద్ నుంచి దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సిఎం కెసిఆర్.. ఆ పథకంలో ఇంకా పొందుపర్చాల్సిన అంశాల గురించి మేధోమథనం చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో దళితవాడలో పర్యటిస్తానని ఇచ్చిన హామీ అమలు కావడంతో పాటు దళితులతో నేరుగా మాట్లాడడం వల్ల దళితబంధు పథకాన్ని పకడ్బందీగా క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కోసం ఈ పర్యటన దోహదపడనుందని అధికారులు తెలిపారు.
దళితవాడ పరిశీలన
దళితులతో సిఎం నేరుగా ఇస్టాగోష్టిగా మాట్లాడుతారని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డిసిపి కె. నారయణరెడ్డి, డిఆర్‌డిఒ మందడి ఉపేందర్‌రెడ్డిలతో కలిసి ఆమె వాసాలమర్రిలోని దళితవాడను సందర్శించారు. సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపిటిసి పలుగుల నవీన్ కుమార్‌లతో సమావేశమై సిఎం రాక సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట జెడ్పి సిఇఒ కృష్ణారెడ్డి, ఆర్‌డిఒ భూపాల్‌రెడి,్డ ఎసిపి కోట్ల నర్సింహరెడ్డి, సిఐ నర్సయ్య, తహసీల్దార్ జ్యోతి, ఎంపిడిఒ ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. జిల్లా అధికారులు ముందస్తుగా ఆ కాలనీలోని సమస్యలను అధ్యయనం చేసి వాటిని గుర్తించారు. ఎస్సి జనాభా, ఇండ్లు, వ్యవసాయం, నిరుద్యోగం, పెన్షన్లు తదితర పూర్తి సమచారాన్ని అంగన్వాడీ టీచర్ల ద్వారా సర్వే చేయించి సేకరించిన వివరాలను కలెక్టర్ మరోసారి సమీక్షించారు. గ్రామంలోని దళితవాడతో పాటు గ్రామం మొత్తం తిరిగి పారిశుద్ధ్య పనులు, గ్రామంలోని రైతు వేదిక భవనాన్ని, హరితహారంలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ గ్రామాన్ని పరిశీలించిన తరువాత అధికారులతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు. వాసాలమర్రి గ్రామ సమగ్రాభివృద్ధికి కలెక్టర్ పర్యవేక్షణలో ర్రూపొందించిన పణాళికల బ్లూ ప్రింట్‌ను బుధవారం సిఎంకు వివరించనున్నారు.
130 మందితో సమావేశం
సిఎం కెసిఆర్ దళితవాడలో పర్యటించి నేరుగా సమస్యలు తెలుసుకున్న తరువాత గ్రామంలోని రైతు వేదికలో 130 మందితో సమావేశమవుతారు. ఇందులో దళిత కాలనికి చెందిన పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులతో పాటు ఇటీవల గ్రామాభివృద్ది కోసం వేసిన వివిధ కమీటీల కన్వీనర్లు, సభ్యులు ఉంటారు. వీరితో సిఎం నేరుగా గ్రామాభివృద్ధిపై చర్చించనున్నారు. సిఎంతో సమావేశమయ్యేటువంటి 130 మందిని కలెక్టర్ పర్యవేక్షణలో ఎంపిక చేసినట్టు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు తెలిపారు.
స్పష్టమైన హామీ ఇవ్వలే..
గత నెల 22న సిఎం కెసిఆర్ వాసాలమర్రికి వచ్చి గ్రామస్తులతో సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి కెసిఆర్ స్పష్టమైన హామీలు మాత్రం ఇవ్వలేదు. అభివృద్ధి కోసం రూ. 100 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఇస్తానని ప్రకటించారు. అయితే ముందస్తుగా గ్రామంలో కమిటీలు వేసుకోవాలని సూచించారు. సిఎం సూచన ప్రకారంగా కలెక్టర్ పమేలా సత్పతి గ్రామంలో ఏడు అభివృద్ధి కమిటిలను వేశారు. గ్రామాభివృద్ధి కమిటీలో 25 మంది సభ్యులును, శ్రమదాన కమిటీ సహా మరో ఐదు కమిటీల్లో 15 మంది చొప్పున సభ్యులను నియమించారు.
భారీగా మొహరించిన పోలీసులు
సిఎం రాక సందర్భంగా వాసాలమర్రిలో పోలీసులు భారీగా మోహరించారు. అదనపు పోలీసు బలగాలు వాసాలమర్రిని అష్టదిగ్భందనం చేశాయి. సిఎం పర్యటించే ప్రాంతాల్లో డాగ్, బాంబ్ స్కాడ్ పోలీసులు విస్త్రతంగా తనిఖీలు చేపట్టారు. ఫాంహౌజ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాసాలమర్రికి సిఎం వచ్చే అవకాశాలు ఉన్నందున ఆ మార్గాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పర్యవేక్షణలో డిసిపి కె.నారాయణరెడ్డి పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నారు.
వాసాలమర్రికి ముఖ్యమంత్రి
RELATED ARTICLES