ముందు వారి సభ్యత్వాన్ని రద్దు చేయండి
20న సిఎల్‌పి సమావేశమే జరగలేదు
శాసనమండలి చైర్మన్‌కు షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినతి పత్రం
ప్రజాపక్షం/హైదరాబాద్: గతంలోనే టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎంఎల్‌సిలు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని (సిఎల్‌పిని) టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం (టిఆర్‌ఎస్‌ఎల్‌పి)లో విలీనం చేయాలని లేఖ ఇవ్వడం అర్థరహితమని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలిలో సిఎల్‌పి నేత షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్‌ను శుక్రవారం ఆయన కార్యాలయంలో కలి సి లేఖను అందజేశారు. ఈ నెల 20వ తేదీన శాసనమండలికి సంబంధించి ఎలాంటి సిఎల్‌పి సమావేశం జరగలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. అందులో అంశాలు ఇలా ఉన్నాయి. “టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో సిఎల్‌పిని విలీనం చేయాలని ఎంఎల్‌సిలు ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డి మీకు ఇచ్చిన లేఖను నిర్దదందంగా తిరస్కరించండి. ఈ నెల 20వ తేదీన ఎలాంటి సిఎల్‌పి సమావేశం జరగలేదని పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నాను. ఎం.ఎస్.ప్రభాకర్ 2015లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ రెండేళ్ళుగా మీ వద్ద పెండింగ్‌లో ఉన్నది. దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. ఆయనపై అనర్హత పిటిషన్ కూడా మీ వద్ద పెండింగ్‌లో ఉన్నది. భారత జాతీయ కాంగ్రెస్ 130 సంవత్సరాల పార్టీ. టిఆర్‌ఎస్‌లోకి ఇప్పటికే ఫిరాయించిన కొందరు సభ్యులు సిఎల్‌పి విలీనంపై దరఖాస్తు ఇవ్వడం అసంబద్ధమైనది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాము. తెలంగాణలో ప్రజాస్వామ్య ఖూనీ ని నిరోధించేందుకు వారి లేఖను తిరస్కరించండి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆ నలుగురి ఎంఎల్‌సి సభ్యత్వాలను రద్దు చేయండి” అని లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాత మరో లేఖను కూడా మండలి చైర్మన్‌కు పంపారు. అందులో ఒక రాజకీయ పార్టీ ని విలీనం చేసే అధికారం స్పీకర్, చైర్మన్ పరిధిలో లేదని రాజ్యాంగంలో, సుప్రీం కోర్టు ఇచ్చిన అనేక తీర్పుల్లో ఉన్నదని, కాంగ్రెస్ నిబంధనావళి ప్రకారం పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసే అధికారం రాష్ట్ర కమిటీలకు లేదని, ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేయలేరని, విలీనాన్ని అన్ని రాష్ట్రాల కమిటీలు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విలీనం చేయాలని కోరడం ద్వారా అనర్హతకు ఆ సభ్యులు అర్హులైనట్లేనని, రాజ్యాంగం పదవ షెడ్యూలు నాలుగవ పేరాను ఇతర పేరాలతో కలిపి చదవాలే తప్ప, కేవలం దాన్నొక్కటే పరిగణలోకి తీసుకోవద్దని, నలుగరు ఎంఎల్‌సిల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకున్నాకే వారిచ్చిన దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.