వారి కోసమే..

అదానీ, అంబానీలకు ప్రభుత్వరంగ బ్యాంకుల అప్పగింతకు కుట్ర
ప్రజా ఉద్యమాలతో ప్రైవేటీకరణను అడ్డుకుంటాం : ఎఐటియుసి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ వేలాది కోట్ల రుణాలు చెల్లించకుండా ముంచేసిన కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకులను అప్పగించేందుకు ప్రధాని నరేంద్రమోడీ కుట్రపన్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌ విమర్శించారు. దేశ ప్రధానిగా కాకుండా అదానీ, అంబానీలకు తొత్తుగా మోడీ పనిచేస్తున్నారన్నారు. సామాన్యులకు నష్టం కలుగచేసే బ్యాంకుల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని బోస్‌ తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ జాతీయ కమిటీ పిలు పు మేరకు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి బోస్‌ మాట్లాడుతూ విస్తృతమైన ప్రజా ఉద్యమాలతో బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని బోస్‌ హెచ్చరించా రు. దేశం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశా లు పెరిగి, ఉద్యోగాలు రావాలన్నారు. అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల పేరుతో ఉన్న ఉద్యోగాలను తొలగించే విధానం అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. అలాంటి అభివృద్ధి ప్రజలు కోరుకోవడం లేదన్నారు. నిజమైన అభివృద్ధి జరిగితే దేశంలో లక్షలాది ఉద్యోగాలు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కార్పొరేట్‌ శక్తులు నడిపిస్తున్నాయని బోస్‌ విమర్శించారు. 1969 వరకు ప్రైవేట్‌గా ఉన్న బ్యాంకులను అనేక పోరాటాలతో జాతీయం చేశారని గుర్తు చేశారు. అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను తిరిగి ప్రైవేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం ప్రజలకు తీరని ద్రోహం చేయడమేనన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రోత్సహంతోనే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు లభించి, వృద్ధి సాధించారని చెప్పారు. ప్రైవేట్‌ రంగంలో ఉన్న గ్లోబల్‌ ట్రస్ట్‌, ఎస్‌ బ్యాంకులు మూసేశారని, దీంతో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకును ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిపారని, నష్టపోయిన ప్రైవేట్‌ బ్యాంకును ప్రభుత్వ బ్యాంకుల్లో ఎందుకు కలిపారని బోస్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల ప్రజల డిపాజిట్లను కొల్లగొట్టేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. డిపాజిట్లను ఖాళీ చేసి, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, బిహెచ్‌ఇఎల్‌, హెచ్‌ఎఎల్‌ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారని మండిపడ్డారు. యుద్ధ విమనాలను తయారు చేసే హెచ్‌ఎఎల్‌ను కూడా ప్రైవేట్‌ పరం చేయడం మోడీ ప్రభుత్వానికే చెల్లుతుందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక మూడు చట్టాలపై శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను టెర్రరిస్టులు, ఖలీస్తాన్‌, దేశ ద్రోహులుగా బిజెపి ప్రభుత్వం ముద్ర వేసిందన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటే ఇప్పుడు అధికారులు, ఉద్యోగులను దేశ ద్రోహులుగా ముద్రవేస్తారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని రంగాల సంస్థలను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దశల వారీగా ప్రైవేటీకరిస్తుందని విమర్శించారు. డిపాజిట్ల రూపంలో ఉన్న ప్రజల డబ్బులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి, ప్రజల పక్షాన బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని బోస్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐబిఇఎ ఎపి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి బి.ఎస్‌.రాంబాబు, ఐఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?