కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాప్తి చెం దుతున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధించిన కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుని అల్లాడుతున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల రైలు ఛార్జీలు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలే భరిస్తాయని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఇబ్బందిపడుతున్న కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకట న విడుదల చేశారు. వీరందరినీ వారి ప్రాంతాలకు సురక్షితంగా, ప్రభుత్వ ఖర్చులతో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. అనేక మంది కూలీలు ఆహారం, నీరు, మందులు, డబ్బు లేకుండానే కాలినడన బయలుదేరారని గుర్తుచేశారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంలో బిజెపి సర్కార్ ఘోరంగా విఫలమైందని సోనియా విమర్శించా రు. విదేశాల్లో నిలిచిపోయిన ప్రవాసుల్ని విమానాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చినప్పుడు.. దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కూలీల విషయం లో మాత్రం ఎందు కు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారు. గుజరాత్లో ఓ కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు, వారికి భోజన వసతి కల్పించేందుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పేద కూలీల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు. పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.151 కోట్ల నిధుల్ని విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించలేదా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి వలస కార్మికులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదని సోనియా అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ స్పందించి పేద కూలీలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిందన్నారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేసి తిరిగి వాటిని తమకు అందించాలని రైల్వేశాఖ కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థలాలకు తీసుకెళ్లాయి. ఇంకా కొన్ని రైళ్లు అందుకు సిద్ధమవుతున్నాయి.