HomeNewsBreaking Newsవరి కుప్పలపైనే రైతులు మరణిస్తున్నా... సిఎంలో చలనం లేదు

వరి కుప్పలపైనే రైతులు మరణిస్తున్నా… సిఎంలో చలనం లేదు

ఎవరిని ఉద్ధరించడానికి రాష్ట్రంలో ధర్నాలు
ఢిల్లీలో చేసి కేంద్రం తీరును ఎండగట్టాలి
72 గంటల ‘రైతు వేదన’ నిరాహార దీక్షలో షర్మిల
ప్రజాపక్షం/ హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధైర్యముంటే కేంద్రంపై ఢిల్లీలో ధర్నాలు, ప్రెస్‌మీట్‌లు పెట్టాలని, కేంద్రం విధిస్తున్న ఆంక్షలను వివరించి ఎండగట్టాలని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల అన్నారు. ఢిల్లీలో చేతకాక ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి ధర్నాలు పెడుతున్నారని ప్రశ్నిచించారు. రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని వైఎస్‌ఆర్‌టిపి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో “రైతు వేదన” పేరుతో షర్మిల 72 గం టల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వరి కొనుగోలు విషయంలో నెపం ఒకరి మీద ఒకరు వేసుకుంటూ అన్నం పెట్టే రైతన్న నోట్లో మాత్రం సున్నం పెడుతున్నారని విమర్శించారు. రాష్ర్ట రైతాంగం అంతా వరి పండించి ఆ వరిని ఎక్కడ పడితే అక్కడ ఆరబెట్టుకుంటూ తిప్పలు పడుతున్నారని, ఆ వరి కుప్పల మీదే ఇప్పటికే ముగ్గురు రైతులు చచ్చిపోయినా దున్నపోతు మీద వాన పడినట్లు కెసిఆర్‌లో మాత్రం చలనం లేదన్నారు. వచ్చే యాసంగిలో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కాకుండా రా రైస్‌ మాత్రమే కొంటానన్న విషయాన్ని కెసిఆర్‌ ఇప్పుడే ముందుకు తీసుకువచ్చి ఈ వానాకాలం వడ్లను కొనే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. వానాకాలంలో 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సిఐ సిద్ధంగా ఉన్నప్పటికీ.. కెసిఆర్‌ రైతుల నుండి ఎందుకు వడ్లు కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాలను ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. అసలు కెసిఆర్‌కు వరి ధాన్యం కొనే ఉద్దేశం ఉందా లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా కెసిఆర్‌ మారిపోయాని, ఢిల్లీకి వెళ్లి వంగి, వంగి దండాలు ఎందుకు పెడుతున్నారని షర్మిల అన్నారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని ఎందుకు చెబుతున్నారని, బాయిల్డ్‌ రైస్‌ కాదు.. రా రైసే కొంటామని కేంద్ర ప్రభుత్వం చెబితే.. కెసిఆర్‌ ఎందుకు ఒప్పుకున్నారని, సంతకాలు పెట్టారని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలు మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ , కేరళలలో మద్దతు ధరతో పాటు బోనస్‌ ఇచ్చి ధాన్యాన్ని కొంటున్నారని, కెసిఆర్‌ బోనస్‌ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్న బియ్యానికి రూ.300 ఎక్కువ ఇచ్చి మరీ ధాన్యం కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
రైస్‌మిల్లర్‌లకు మేలు చేసేందుకే : తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఒక ఇండిపెండెంట్‌ అసోసియేషన్‌ గానే ఉండాలని, అలా కాకుండా ఇండిపెండెంట్‌ ఆర్గనైజేషన్స్‌ను, ట్రేడ్‌ యూనియన్‌లను గంపా గుత్తగా టిఆర్‌ఎస్‌ పార్టీలో కెసిఆర్‌ చేర్చుకున్నారని షర్మిల ఆరోపించారు. అందుకే కెసిఆర్‌ మిల్లర్లకు మేలు చేయాలని చూస్తున్నారని అన్నారు. సాయంత్రం అనుమతి ఇచ్చినంత వరకు ధర్నాచౌక్‌లో దీక్ష చేసిన షర్మిల అనంతరం తన నివాసం లోటస్‌పాండ్‌లో 72 గంటల నిరసన దీక్షను కొనసాగించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments