వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నాహాలు

అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకే దశలో…
ప్రజాపక్షం / హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) ప్రక్రియ ప్రారంభించింది. మున్సిపల్‌ ఎన్నికల కోసం రిజర్వేషన్‌ల అంశం, వార్డుల విభజన, ఓటర్ల జాబి తా, పోలింగ్‌ కేంద్రాల జాబితాపై ఎస్‌ఇసి స్పష్టతనిచ్చింది. వార్డుల విభజన కూడా పూర్తి చేసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ల పాలక మండలి గడవు మార్చి 21 తో ముగిసింది. సిద్ధిపేట కార్పొరేషన్‌ పాలక మం డలి గడువు ఈనెల 15తో పూర్తవుతున్నది. జిహెచ్‌ఎంసితో పాటు ఇతర మున్సిపాలిటీలలో ఖాళీలు ఏర్పడిన స్థానాల్లో కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఇసి కమిషనర్‌ సి.పార్థసారిథి బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు ప్రతి అంశంలో అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకోవాల్న సూచించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైందని, కమిషనర్‌, డైరెక్టర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సాధారణ ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి, సూచనలు, నియమావళి రూపొందించి ప్రచురించామని, అవే సూచనలు, నియమ నిబంధనలు ప్రస్తుత ఎన్నికలకు కూడా వర్తిస్తాయని, ఈ సుచనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించే విధంగా సిడిఎంఎ చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, ఇండేలిబుల్‌ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి సిడిఎంఎ పర్యవేక్షిస్తారని తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు అర్హతగల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం 15న ప్రచురిస్తుందని, ఆ జాబితాను టిఈ-పోల్‌ సర్వర్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఆ జాబితా ఆధారంగా ఈ నెల 5వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించామని, దానిపై అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 11వ తేదీన తుది ఓటరు జాబితాలను వార్డు వారీగా ప్రచురించాలని కమిషనర్‌ సి.పార్థసారిధి అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్‌, డైరెక్టర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌, సంబధిత జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గోన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?