కెనరా బ్యాంకులో నకిలీ డాక్యుమెంట్లతో రూ. 3.87 కోట్లు కొల్లగొట్టిన ఉదంతం
20 మంది వ్యాపార, ఇంటి నిర్మాణాల పేరుతో రుణాలు
నిందితుల్లో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో కెనరా బ్యాంక్లో నకిలీ డాక్యుమెంట్లతో దాదాపు నాలుగు కోట్ల రూపాయల రుణాల ను కొల్లగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చిం ది. వరంగల్ నగరానికి చెందిన 20 మంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కయి ఈ దందాను కొనసాగించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది నిందితులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ నక్కలగుట్టలోని కెనరా బ్యాంకు (సిండికేట్ బ్యాంకు)లో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో సుమారు రూ.3.87 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బ్యాంకు చీఫ్ మేనేజర్ ఫణికుమార్ నిందితులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సుబేదారి సిఐ రాఘవేందర్ తెలిపారు. మేనేజర్, సిఐ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది వ్యాపార, ఇంటి నిర్మాణాలతో పాటు వివిధ యూనిట్లు నెలకొల్పుతున్నామని, నక్కలగుట్ట బ్రాంచిలో రుణాలు పొందారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉండడంతో అనుమానం వచ్చిన బ్యాంకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా నకిలీ డాక్యుమెంట్ల బాగోతం బయటపడింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది, ప్రభుత్వ రాయితీ సొమ్మును కూడా వాడుకున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా 420, 406, 464,ఆర్1డబ్ల్యు, 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి సిఐ రాఘవేందర్ తెలిపారు.
వరంగల్లో బ్యాంకుకు టోకరా
RELATED ARTICLES