వణికిస్తున్న కరోనా

ఒక్క రోజే 4,213 కొత్త కేసులు, 97 మంది మృతి
భారత్‌లో 67,152కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశ వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం నాటికి 4,213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 67,152కు చేరింది. అదే విధంగా మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పేరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 97 మంది మృతి చెంద డం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 2206కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు 20,917 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్‌ ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా, రికవరీ రేటు 31.15 శాతంగా ఉన్నట్లు మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. కొత్తగా సంభవించిన 97 మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 53 మంది ఉండగా, గుజరాత్‌లో 21, పశ్చిమ బెంగాల్‌లో 14, తమిళనాడులో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, హర్యానా, కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కరేసి చొప్పున మరణించారు. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మొత్తం 2206 మరణాల్లో కూడా మహారాష్ర్టే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 832 మంది వైరస్‌బారినబడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ద్వితీయ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 493 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 215 మంది, పశ్చిమ బెంగాల్‌లో 185, రాజస్థాన్‌లో 107, ఉత్తరప్రదేశ్‌లో 74, ఢిల్లీలో 73, తమిళనాడులో 47, ఆంధ్రప్రదేశ్‌లో 45, కర్నాటక, పంజాబ్‌లో 31 మంది చొప్పున మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందగా, హర్యానాలో 10 మంది, జమ్మూకశ్మీర్‌లో 9, బీహార్‌లో ఆరుగురు, కేరళలో నలుగురిని కరో నా మహమ్మారి బలితీసుకుంది. జార్ఖండ్‌, ఒడిశాలో ముగ్గురేసి చొప్పున ప్రాణాలు కోల్పోగా, హిమాచల్‌, అసోం, చండీగఢ్‌లో ఇద్దరేసి చొప్పున, మేఘాలయ, ఉత్తరాఖండ్‌లో ఒక్కరేసి చొప్పున మరణించినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర అటు బాధితుల్లోనూ, మరణాల రేటులోనూ ముందంజలోనే ఉంది. రాష్ట్రంలో మొత్తం 22,171 మందికి కరోనా సోకింది. తరువాత స్థానంలో గుజరాత్‌ ఉండగా, ఇక్కడ 8,194 మందికి, తమిళనాడులో 7,204 మందికి, ఢిల్లీలో 6,923 మందికి, రాజస్థాన్‌లో 3,814, మధ్యప్రదేశ్‌లో 3,614, ఉత్తరప్రదేశ్‌లో 3,467, ఆంధ్రప్రదేశ్‌లో 1,980, పశ్చిమ బెంగాల్‌లో 1,939, పంజాబ్‌లో 1,823, తెలంగాణలో 1,196, జమ్మూకశ్మీర్‌లో 861, కర్నాటకలో 848, హర్యానాలో 703, బీహార్‌లో 696 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు కేరళలో 512 కరోనా కేసులు నమోదు కాగా, ఒడిశాలో 377, చండీగఢ్‌లో 169, జార్ఖండ్‌లో 157 కేసులు, త్రిపురలో 150, ఉత్తరాఖండ్‌లో 68, అసోంలో 63, ఛత్తీస్‌గఢ్‌లో 59, హిమాచల్‌లో 55, లఢక్‌లో 42, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 33 కేసులు, మేఘాలయలో 13, పుదుచ్చేరిలో 9, గోవాలో ఏడు కేసులు రిజిష్టర్‌ అయ్యారు. అదే విధంగా మణిపూర్‌లో ఇద్దరికి, మీజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, దాదర్‌ నగర్‌ హవేలీలో ఒక్కరేసి చొప్పున వైరస్‌ బారిన పడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?