మూడు రాష్ట్రాల ప్రజా తీర్పు మోడీ దుష్పరిపాలనకు ప్రతిబింబం
బిజెపియేతర పార్టీల భేటీ సానుకూల పరిణామం
సిపిఐ జాతీయ సమితి సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి
ప్రజాపక్షం ప్రత్యేకప్రతినిధి/ విశాఖపట్నం: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 350 నుండి 400 స్థానాలలో బిజెపి, లౌకిక పార్టీల మధ్య ముఖాముఖి పోటీలకు అవకాశం ఉందని సిపిఐ అభిప్రాయపడింది. మూడు హిందీ రాష్ట్రాల్లో ప్రజాతీర్పు ప్రధాని నరేంద్రమోడీ దుష్పరిపాలనకు ప్రతిబింబమని, డిసెంబరు 10వ తేదీన ఢిల్లీలో జరిగిన చిన్న, పెద్ద 22 భావసారూప్య పార్టీల సమావేశం సానుకూల పరిణామమని బుధవారం ప్రారంభమైన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు. సమావేశాలు మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరుగుతాయి. రాహుల్‌గాంధీ చంద్రబాబునాయుడు ఆహ్వానించిన మేరకు డిసెంబరు 10న జరిగిన భావసారూప్య లౌకికపార్టీల సమావేశం విజయవంతం కాదని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఎన్ని పుకార్లు పుట్టించినా, విషప్రచారాలు చేసినా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, జెడి యు, డియంకె, ఆర్‌జెడి, టిడిపిలతో పాటు సిపియం తరఫున సీతారాం ఏచూరి, రంగరాజన్, సిపిఐ పక్షాన సుధాకరరెడ్డి, డి.రాజా హాజరై మోడి ప్రభుత్వ దుష్పరిపాలనపై ఒక విధాన ప్రకటనను వెలువరించిన విషయాన్ని సుధాకరరెడ్డి గుర్తు చేశారు. సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌పార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనలేదని, అయితే, రాజస్థాన్ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటుచేయడానికి ఈ రెండు పార్టీలు తమ మద్దతును ప్రకటించడం సానుకూల పరిణామమన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ప్రతిపక్ష పార్టీల మధ్య అన్ని రాష్ట్రాలలో కాకపోయినా అత్యధిక రాష్ట్రాలలో పొత్తు సాధ్యమని, తద్వారా 350 నుండి 400 లోక్‌సభ స్థానాలలో బిజెపితో ముఖాముఖి పోటీకి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు హిందీ రాష్ట్రాలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు హర్షణీయమని, అయితే వామపక్షాలకు సిపిఐకి ఈ ఫలితాలు కనువిప్పు కల్గించాలని అన్నారు. “మన స్థావరాలను పదిలపర్చుకోవడంలో, విస్తరించడంలో, ప్రజాశ్రేణులను ఆకర్షించడంలో, ప్రజా ఉద్యమాలను నియోజకవర్గాలలో నిర్మించడంలో మనం విఫలమైనాం. బూర్జువా పార్టీల మాదిరిగానే చివరి సమయంలో ప్రచారాన్ని చేపట్టి ఓటర్లను మార్చగలమన్న రీతిలో మనం వ్యవహరిస్తున్నాం. ఎన్నికల్లో మన ఓటమిని, మనం దేనికీ కొరగాకుండా పోవడాన్ని మనం తీవ్రమైన అంతఃమథనం చేసుకోవాలని సుధాకరరెడ్డి చెప్పారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలకు వివిధ రాష్ట్రాలనుండి వందకుపైగా జాతీయ సమితి సభ్యులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. విశాఖ జిల్లా పార్టీ ఈ సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ఆర్థిక విధానాలు, రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, రానున్న లోక్‌సభ ఎన్నికలపై నివేదికను సమర్పించారు. వల్లభ్‌సేన్‌గుప్తా అంతర్జాతీయ పరిణామాలపై నివేదిక ఇచ్చారు. అంతకుముందు, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివేదిక సమర్పించారు. కాగా, మహిళా ఉద్యమ నేత చండ్ర రాజకుమారి మరణంపట్ల, ఇటీవల మరణించిన పలువురు ప్రముఖులకు సిపిఐ జాతీయ సమితి సమావేశం శ్రద్ధాంజలి ఘటించింది.