న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించే అవకాశమున్నట్లు ఎన్నికల ప్యానల్లోని అత్యున్నత వర్గాలు తెలిపాయి. నాలుగు అసెంబ్లీలకు పదవీ కాలం మే, జూన్ 2019లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలతో సహా లోక్‌సభ ఎన్నికలతో పాటే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశమున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మేలో ఆ గడువు ముగియనున్నందున లోక్‌సభ ఎన్నికలతో పాటే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఎన్నికలు నిర్వాహకుడొకరు చెప్పారు. అయితే అంతకు ముందు కూడా జరగవచ్చన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆరేళ్ల పదవీ కాలం మార్చి 16, 2021లఓ ముగియనుంది. కాగా, ఇతర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ పదవీకాలం మాత్రం ఐదేళ్లే ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భద్రతా సిబ్బందిని జమ్మూకశ్మీర్‌లో మొహరింపజేస్తారు కాబట్టి అప్పుడే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు పరిస్థితులు అనువుగా ఉంటాయని కొన్ని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక సిక్కిం అసెంబ్లీ పదవీ కాలం మే 27, 2019న, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల పదవీ కాలాలు వరుసగా జూన్ 18, జూన్ 11, జూన్1న ముగియనున్నాయి. అదే సమయాల్లో లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నందున పనిలో పనిగా ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు కలిపే నిర్వహిస్తారని ఎన్నికల నిర్వహకుడొకరు చెప్పారు. అయితే నాలుగు రాష్ట్రాలు, లోక్‌సభ ఎన్నికలకు తోడుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను కూడా జతచేస్తే ఇక 2019లో ఎన్నికలు ఉండబోవని మరో ఎలక్షన్ కమిషన్ అధికారి వెల్లడించారు.
లోక్‌సభతో పాటే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు?
RELATED ARTICLES