HomeNewsBreaking Newsలాక్‌డౌన్‌ ఉండదిక!

లాక్‌డౌన్‌ ఉండదిక!

అన్‌లాక్‌ 2.0పైనే మా దృష్టి : ప్రధాని మోడీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ల దశ ముగిసిందని, అన్‌లాక్‌ల దశ మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఇకముందు లాక్‌డౌన్‌లు వుండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్‌లాక్‌ 1.0 నడుస్తున్నదని, అన్‌లాక్‌ 2.0 ఎలా వుండాలన్న విషయంపైనే ఇప్పుడు ఆలోచించాలని అన్నారు. బుధవారంనాడు ప్రధా ని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారంపై ప్రధాని స్పందించారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అన్‌లాక్‌ 1.0 సాగుతోందని, అన్‌లాక్‌ 2.0 ఎలా అమలుచేయాలనే దానిపై చర్చించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ కోరగా ప్రధాని ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. కరోనా కట్టడికి టెస్టింగ్‌ల సామర్థ్యం పెంచడంతో పాటు  ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని ప్రధాని కోరారు. కరోనా వైరస్‌ పరీక్షలను ముమ్మురంగా చేపట్టేందుకు టెస్టింగ్‌ సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు మహమ్మారి బారిన పడిన వారి పట్ల వివక్ష చూపడం తగదని పేర్కొన్నారు. కోవిడ్‌-19 బారినపడి కోలుకునే వారిసంఖ్య పెరగడం వైరస్‌ వ్యాప్తి కట్టడికి సానుకూల సంకేతమని అన్నారు. దేశవ్యాప్తంగా 900కిపైగా టెస్టింగ్‌ ల్యాబ్‌లున్నాయని, లక్షల సంఖ్యలో కోవిడ్‌ పడకలు, వేలాది క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, సరిపడా ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రజల్లో నాటుకుపోయిన ఇన్ఫెక్షన్‌ భయాన్ని మనం పారద్రోలాలని అన్నారు. కరోనా వైరస్‌నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు కోలుకుంటున్న క్రమంలో వారు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు విధిగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని, ఇన్ఫెక్షన్‌ సోకకుండా తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కొన్ని నగరాలు జనసమ్మర్ధంతో నిండిపోయి భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్‌తో పోరు సవాళ్లతో కూడుకున్నదని ప్రధాని అన్నారు.

కరోనా అదుపులోనే
లాక్‌డౌన్‌పై ప్రధాని వివరణతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంతృప్తి
బీహార్‌ హమాలీలను ఆపొద్దు
నితీశ్‌కు కెసిఆర్‌ వినతి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ దేశంలో లాక్‌డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్‌ల దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రధాని బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి మోడీ స్పందించారు. “దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్‌డౌన్‌ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్‌డౌన్‌ విషయంలో నిర్ణయం తీసుకోరు అని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి” అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. “దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు. నాలుగు దశల లాక్‌డౌన్‌ ముగిసింది. అన్‌ లాక్‌ 1.0 నడుస్తున్నది. అన్‌లాక్‌ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి” అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. “కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం నాకున్నది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెల్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి. దేశంలో ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి. బీహార్‌ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు” అని సిఎం చెప్పారు. బీహార్‌ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ సరదాగా స్పందించారు. “నితీష్‌ గారు, తెలంగాణలో మీ హమాలీలను మేము బాగా చూసుకుంటాం. మా సిఎస్‌ కూడా మీ బీహార్‌ వారే. దయచేసి పంపించండి” అని కెసిఆర్‌ అన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments