బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనలో జిహెచ్‌ఎంసి నిర్లక్ష్యం
కోటికిపైగా జనాభాకు కేవలం 382 టాయిలెట్‌లు మాత్రమే
గత ఆగస్టులోగా 3వేల టాయిలెట్‌లు ఏర్పాటు చేస్తామన్న అధికారులు
ప్రజాపక్షం/హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్‌ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా రూపుదిద్దుతామని జిహెచ్‌ఎంసి ప్రకటించింది. అందుకోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా ప్రణాళికలు రూపొందిచారు. నగరంలో జనసమ్మర్థమైన ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి జోన్‌కు 500 టాయిలెట్స్ చొప్పున 3 వేలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై టాయిలెట్స్ ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా వాటిని అందుబాటులోకి తీసుకురావడం లేదు. కోట్లాది రూపాయల వ్యయం చేసినా బహిరంగ మూత్ర విసర్జనను నిర్మూలించలేక పోతున్నారు. 2016లోజరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు భారీ ఎత్తున స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి మొదలుకొని సాధారణ పౌరుని వరకు అందరినీ భాగస్వాములను చేశారు. నగరాన్ని చెత్త, చెదారం రహితంగా మార్చడం, బహిరంగా మల మూత్ర విసర్జన లేకుండా చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు. కానీ ఇప్పటి వరకు లక్ష్యాలను అధిగమించని స్థితిలోకి జిహెచ్‌ఎంసి వెళ్లిపోయింది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం ఉంటున్నాయి. ఒడిఎఫ్ సిటీగా ప్రకటించినా కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతూనే ఉంది.
నగరంలో కేవలం 382 పబ్లిక్ టాయిలెట్‌లే…
హైదరాబాద్ మెట్రో నగరం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నిత్యం పనుల కోసం లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. నగర ప్రజలు కూడా ఉద్యోగ, వ్యాపారాలతో పాటు వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వస్తారు. బయటకు వచ్చిన వారి అవసరాలకు తగ్గట్టుగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో ప్రతి కిలో మీటర్‌కు, సాధారణ ప్రాంతాల్లో 2 లేదా 3 కిలో మీటర్లుకు ఒక పబ్ల్లిక్ టాయిలెట్‌లు తప్పని సరిగా ఉండాలి. దాదాపు 9,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర రహదారుల్లో 5000వేల కిలో మీటర్లలో సగానికిపైగా నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ లెక్కన నగరంలో సుమారు 5000 వేల పబ్లిక్ టాయిలెట్స్ వరకు అవసరం ఉంటుంది. ప్రతి వెయ్యిమందికి ఒక టాయిలెట్ ఉండాలని మరొక అధ్యయనం చెబుతుంది. అలా అయితే 10వేల టాయిలెట్స్ అవసరం అవుతాయి. కానీ జిహెచ్‌ఎంసి పరిధిలో కేవలం 382 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వీటిలో 135 బిఒటి టాయిలెట్లు, 109 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్, 46 సులభ్, 57 ఇంజనీరింగ్, 15 షీ- టాయిలెట్లు, 20 కమ్యూనిటీ టాయిలెట్లు ఉన్నట్లుగా జిహెచ్‌ఎంసి అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే వాటికి తోడు ప్రస్తుతం ప్రతి జోన్‌కు 500 చొప్పున ఆరు జోన్‌ల పరిధిలో 3వేల టాయిలెట్స్ నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 2వేల వరకు టాయిలెట్స్‌ను రోడ్లపై ఏర్పాటు చేశారు. కానీ వాటికి సివరేజి, నీటి కనెక్షన్‌లు ఏర్పాటు చేయలేదు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఆగస్ట్ 15నాటికి అన్ని టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకోస్తామని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించారు. నెలలు గడుస్తున్నా వాటిపై దృష్టి పెట్టడం లేదు. నెలల తరబడి ఫుట్‌పాత్‌లపై నిరుపయోగంగా ఉన్నాయి. అందులో ఉన్న టాప్స్ మాయం కాగా పలు ప్రాంతాల్లో టాయిలెట్స్ ధ్వంసమయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొత్తపేట్ జంక్షన్ వద్ద ఒకే ప్రాంతంలో ఐదు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కనీసం 25 మీటర్ల దూరం కూడా లేకుండా ఐదు టాయిలెట్స్ ఎందుకు ఏర్పాటు చేశారనే విషయం అధికారులకే తెలియాలి. ఒక్కో టాయిలెట్‌కు 2 నుండి 3 లక్షల వరకు ఖర్చుచేస్తున్న అధికారులు ప్రజాధనం దుర్వినియోగమవుతున్నా పట్టించుకన్ను నాథులే లేకుండా పోయారు. 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన షీ టాయిలెట్స్ కూడా వాడకం లేకుండా నిరుపయోగంగా మారిపోయాయి. టాయిలెట్స్ ఏర్పాటు చేసి, వినియోగంలోకి తీసుకురాకపోవడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు.