రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష ఎంపిలు ఆందోళన

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తక్షణే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. కరోనా మహమ్మారి పేరుతో కేంద్రం ప్రజాస్వామ్యం, పార్లమెంట్‌, రాజ్యంగపరిధిలోని సంస్థలపై దాడి చేస్తుందని వామపక్ష ఎంపిలు విమర్శించారు. ప్రభుత్వ విధానాలపై వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఐ(ఎం)లు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసను తెలియజేస్తున్నట్లు సిపిఐ ఎంపి బినయ్‌ విశ్వం మీడియాకు చెప్పారు. సిపిఐ(ఎం) ఎంపి కెకె రాగేశ్‌ మాట్లాడుతూ రైతులకు సంబంధించి పార్లమెంట్‌లో సోమవారం ప్రవేశపెట్టిన మూడు ఆర్డినెన్స్‌లు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, కార్పొరేట్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము ఎందుకు వాటిని వ్యతిరేంచకూడదని ప్రశ్నించారు. రైతులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ లు ‘చీకటి’ ఆర్డినెన్స్‌లను సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ఇది రైతాంగంపై ఘోరమైన దాడి అని వారన్నారు. కాగా, కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన వ్యవసాయ సంబంధిత ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా ఇటీవల పంజాబ్‌, హర్యానా రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆదాయం పెరిగేలా వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు తీసుకువచ్చిన మూడు ఆర్డినెన్స్‌లకు జూన్‌ 5న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?