రైతు ఉద్యమం… 100 రోజుల ఉత్సవం

మార్చి 5న నిర్వహించాలని ఎఐకెఎస్‌ పిలుపు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్షా శిబిరం సందర్శన
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ సందర్శించారు. దీక్ష చేపట్టిన రైతులకు సంఘీభావాన్ని తెలిపారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ప్రధాన కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజాన్‌తో కలిసి పశ్య పద్మ, ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ ఇతర నాయకులు రైతు వేదికను సందర్శించారు. అనంతరం ఢిల్లీ ఆంధ్రభవన్‌లో విలేకరుల సమావేశంలో పశ్య పద్మ మాట్లాడుతూ రైతుల ఉద్యమాన్ని పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉద్యమంగా అసత్య ప్రచారం కొనసాగిస్తున్న ప్రధాని మోడీని యావత్తు దేశ రైతులు అర్థం చేసుకున్నారని, మోసపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టడంలో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారని పశ్య పద్మ అన్నారు. మార్చి 5వ తేదీన దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమం 100 రోజుల ఉత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేస్తే దేశంలో పాలన కొనసాగించలేరని కేంద్ర ప్రభుత్వాన్ని పశ్య పద్మ హెచ్చరించారు. గతంలో అనేక రైతు ఉద్యమాలు విజయవంతమయ్యాయని, జీవించే హక్కును కాలరాసే కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేపట్టిన పోరాటం విజయవంతం అవుతుందన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో అఖిల భారత కిసాన్‌ సభ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అగ్రభాగాన నిలిచి పోరాడుతుందని ఆమె తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?