రైతుల సమస్యలపై స్పందించడం దేశద్రోహమా?

మాట్లాడకపోవడం కంటే జైలులో ఉండడమే మేలు
దిశా రవి వ్యాఖ్యలు.. మంగళవారానికి కేసు వాయిదా
న్యూఢిల్లీ: రైతుల సమస్యలపై స్పందించడం, వారు జరుపుతున్న ఆందోళనను అందరి దృష్టికి తీసుకెళ్లడం దేశద్రోహం అవుతుందా? అని ‘టూల్‌కిట్‌’ కేసులో ఇటీవల అరెస్టయిన బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఢిల్లీ కోర్టులో ప్రశ్నించింది. రైతు ఉద్యమం గురించి మాట్లాడకపోవడం కంటే జైల్లో ఉండడమే మేలని వ్యాఖ్యానించింది. అనంతరం కోర్టు ఈ కేసును మంగళవారానికి వాయిదా వేసింది. రైతులు జరుపుతున్న నిరసన కార్యక్రమాలను అందరి దృష్టికి తీసుకెళ్లడాన్ని తన బాధ్యతగా భావించినట్టు తన లాయర్‌ ద్వారా కోర్టుకు దిశ స్పష్టం చేసింది. 26 జనవరి రోజున జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు తన పోస్టింగ్స్‌తో సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు ఏవీ లేవని దిశ లాయర్‌ అన్నారు. తన ప్రమేయం లేని ఒక సంఘటనను పేర్కొంటూ పోలీస్‌లు దిశను అరెస్టు చేశారని, ఆమెకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ‘టూల్‌కిట్‌’కు, ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న నిరసనలను, అంతర్జాతీయ స్థాయిలో భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలుగా పేర్కోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పోలీస్‌ తరఫు లాయర్‌ జోక్యం చేసుకుంటూ, దీనిని ఒక ‘టూల్‌కిట్‌ అంటూ తేలికగా చూడడానికి వీల్లేదని, భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్టపాల్జేసే కుట్రగా భావించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ధర్మేందర్‌ రాణాను కోరారు. ఒకవేళ దిశ ఎలాంటి పొరపాటు లేదా తప్పు చేయకపోతే, ఆమె తన ట్రాక్‌ను, సాక్ష్యాధారాలను ఎందుకు డిలీట్‌ చేశారని ప్రశ్నించారు. ఖలిస్థాన్‌ ఉద్యమకారులతో ఆమె ‘టూల్‌కిట్‌’ను పంచుకున్నట్టు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై దిశ లాయర్‌ స్పందిస్తూ పోలీస్‌లు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికి కూడా సాక్ష్యాధారాలు లేవని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీస్‌లే అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చినంత మాత్రాన దిశ దేశద్రోహానికి పాల్పడినట్టు అవుతుందా? అని ప్రశ్నించారు. ‘టూల్‌కిట్‌’ షేరింగ్‌ కారణంగానే ట్రాక్టర్‌ ర్యాలీలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, కోర్టు కేసును మంగళవారానికి వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?