ధాన్యం విక్రయించని వారికి ఊరట
సాగు చేయని వారికి నష్టం
భయపెడుతున్న కోతలు
ప్రజాపక్షం/ ఖమ్మం ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు అమీ తుమీ తలపడ్డాయి. బిజెపిపై ఓ రకంగా టిఆర్‌ఎస్ పార్లమెంటు లోపల, బయటా తీవ్ర పోరాటం చేసింది. కొనుగోలు విషయంలో వైఖరిని మార్చుకోలేని బిజెపి నేతలు రాష్ట్రంలో మాత్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే గద్దె దిగాల్సిందేనంటూ హెచ్చరికలు చేసి రాజకీయా న్ని మరింత వేడేక్కించారు. రైతు సాక్షిగా జరిగిన ఈ రాజకీయ క్రీడలో గెలుపెవరిది అన్నది పక్కన పెడితే… ఇప్పుడు ఓడింది ఎవరన్నదే చర్చనీయాంశమైంది. తామే ఆది నుంచి కొనుగోలు చేయలేమని చెబుతున్నాం. ఉప్పుడు బియ్యాన్ని కొనే సమస్యే లేదని చెప్పాం. దానికే కట్టుబడి ఉన్నామని బిజెపి నేతలు చెబుతున్నారు. కొనే దమ్ము లేకపోతే దిగిపోండి అన్నాం… తమ మా టలకు కట్టుబడి ఉన్నాం. తామన్నదే నెగ్గింది. రైతును వరి సాగు చేయమన్నాం. కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పాం. గెలుపు తమదే అన్న ధోరణిలో టిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాం. తెలంగాణలో వ్యవసాయ రంగంలో జరిగిన శీఘ్ర అభివృద్ధిని ఈ దేశానికి చాటిచెప్పాం. రాష్ట్రానికి అన్యా యం జరిగితే మోడీ అయినా మరెవరైనా నిలదీస్తామన్న మా వైఖరికి కట్టుబడి ఉన్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన తెలంగాణ రైతు నష్టపోకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కంటే మాకేది ముఖ్యం కాదు అని టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. వీరిద్దరి రాజకీయ భేదాభిప్రాయాలు రాష్ట్ర, కేంద్ర సంబంధాల నేపథ్యంలో తెలంగాణ రైతుకు మాత్రం నష్టం జరిగింది. ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఉండవని వరి వేయవద్దని టిఆర్‌ఎస్ పార్టీ నేతలు, అధికార యంత్రాంగం పదే పదే ప్రచా రం చేయడంతో రైతాంగం వరి సాగు చేసేందుకు జంకారు. గత కొంత కాలంగా ప్రైవేటు వ్యాపారాలతో నష్టపోతున్న రైతులు ప్రభుత్వం కొనకపోతే మరోమారు ఆర్థికంగా చితికిపోతామన్న భయంతో సాగు చేయలేదు. వానాకాలం వరిసాగు ఈ ఏడు నష్టాలను మిగిల్చింది. దోమ, ఇతర వైరస్ రావడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. యాసంగిలోనైనా ఆ నష్టాన్ని పూడ్చుకుందామంటే ధాన్యం కొనుగోలు చేయమన్న ప్రభుత్వ హెచ్చరిక రైతులను వెనకడుగు వేసేలా చేసింది. ఖమ్మంజిల్లాలో గతేడాది యాసంగిలో సుమారు 2.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే ఈ ఏడాది యాసంగిలో సుమారు 1.05 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. 2020లో సైతం ఖమ్మంజిల్లాలో 2.03 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు చేశారంటే ఈ ఏడాది సాగు ఎంత గణనీయంగా తగ్గిపోయిందో అవగతమవుతుంది. లక్ష ఎకరాల్లో పంట పండించకపోవడానికి కారణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోళ్ల విషయంలో వచ్చిన మనస్పర్థలే. ఇప్పటి మాదిరి ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రకటన ఉన్నట్లయితే కోట్లాది రూపాయలు తెలంగాణ రైతుకు ఆదాయం సమకూరేది. సాగునీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ హెచ్చరికల కారణంగానే వరి సాగు చేయలేకపోయారు. మారిన పరిస్థితులలో తేలికపాటి నేలల్లో తప్ప మిగిలిన భూముల్లో వాణిజ్య పంటలు సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. సాగునీరు ఉన్నా పండించే రైతు ఉన్నా ఈ ఏడాది యాసంగికి సంబంధించి బీడు భూములే దర్శనమిస్తున్నాయి. ఇక ఇప్పటికే కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించడం వల్ల ధర తక్కువగా ఉండి ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందుకు రైతాంగం హర్షం వెలిబుచ్చుతూనే వానాకాలం పంటకు సంబంధించిన అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలం పంటకు సంబంధించి మిల్లర్లు భారీగా కోతలు విధించారు. క్వింటాకు మూడు నుంచి 15 కిలోల వరకు కోతలు విధించారు. ప్రభుత్వం క్వింటాకు రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తున్నప్పటికీ కోతలు రైతును నష్టపరుస్తున్నాయి. మిల్లర్ల కోతతో పాటు కొనుగోలు కేంద్రాల బాధ్యులు సైతం కోతల పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో తూకాల్లో కోతలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించకుండా పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన వారిని మాత్రమే రైతులుగా గుర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో 50 శాతానికి పైబడిన రైతులను గుర్తించనట్లే లెక్క. మొత్తం సాగు చేస్తున్న వారిలో 50 శాతానికి పైబడి కౌలు రైతులే ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతుల పట్ల పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైతులదే ఓటమి!
RELATED ARTICLES