రైతుకు చేటు.. కార్పొరేట్లకు మేలు

మోడీ ప్రభుత్వ ఆర్డినెన్స్‌ల ఉపసంహరణకు డిమాండ్‌
అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ నిరసన
ప్రజాపక్షం / హైదరాబాద్‌ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసి, బడా కార్పొరేట్లకు ధారదత్తం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లతో పాటు విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌ వద్ద జెండాలు, ఫ్లకార్డులు పట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ నిరసన నిర్వహించారు. ఉద యం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టిన స్వేచ్ఛావాణిజ్యాన్ని రద్దు చేయాలని, కంపెనీలకు కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని అప్పగించే చర్య లు మానుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తులపై పరిమితి రద్దును వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ, గృహ వినియోగదారులపై ఛార్జీల భారం పెంచే విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ రైతుల నడ్డి విరిచే ఈ ఆర్డినెన్స్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు వ్యవసాయ రంగంలోకి అడుగు పెడితే చిన్న సన్నకారు రైతులు తమ పొలాల్లో తామే కూలీలుగా మారిపోతారని చెప్పారు. విద్యుత్‌ సంస్కరణ బిల్లు వల్ల ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత్‌ విద్యుత్‌తో పాటు రాయితీలు కనుమరుగవుతాయన్నారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శులు టి.సాగర్‌ మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన వ్యవసాయ, విద్యుత్‌ సవరణ బిల్లుల వల్ల రైతులు, చిన్న చితక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంటలను కారుచౌకగా కొనుగోలు చేసి, బడా వ్యాపారులు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం మాటలు చెప్పకుండా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో ఈ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఐకెఎస్‌సిసి జాతీయ కార్యవర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ల వల్ల వ్యవసాయ రంగం దివాళా తీయనుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి అంబానీలు, అదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఎఐకెఎస్‌సిసి నాయకులు పి.జంగారెడ్డి, కన్నెగంటి రవి, ఉపేందర్‌రెడ్డి, రాయల చంద్రశేఖర్‌, మూడ్‌ శోభన్‌, బి.కొండల్‌, అబ్బాస, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?