సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణలో గత 16సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎన్హెచ్ఎం, ఎఎన్ఎంల సర్వీసులను భేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండవ ఎఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎఐటియుసి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎఐటియుసి రాష్ర్ట నాయకులు తోట రామాంజనేయులు నేతృత్వంలో జరిగిన ధర్నాలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అసలు రెండో ఎఎన్ఎం అనే పదంలో నే వివక్షత ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా భావిస్తున్నారనటానకి ఈ పదమే నిదర్శనమని విమర్శించారు. కరోనా
కష్టకాలంలో ప్రజలకు సేవ చేసిన సిబ్బందిని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకే పని ఒకే విద్యార్హత ఉండి వేతనంలో భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉండటం వివక్షచూపించడమే అని విమర్శించారు. ఉద్యోగంలో చేరి 20, 25 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం బాధాకరమన్నారు. కనుక ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆలోచన చేసి, 20 సంవత్సరాల సేవకుగాను రిటైర్ అయ్యాక పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు.
హరీష్ రావు క్షమాపణ చెప్పాలి : రాజ్యసభ సభ్యులు ఆర్. కష్ణయ్య
చాలిచాలని వేతనాలతో బతుకుతున్నామని కనీసం ఆకలి కూడా తీరటం లేదని కనుక జీతాలు పెంచాలని రెండో ఎఎన్ఎంలు తమ గోడును హరీష్ రావు దగ్గర మొరపెట్టుకుంటే జీతాలు చాలక పోతే ఈ పని మానేసి వేరే పనికి పోండి అని వారిని ఎగతాళి చేసిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని బిసి ఉద్యమ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్. కష్ణయ్య డిమాండ్ చేశారు. సేవాభావంతో పనిచేసే ఎఎన్ఎంలను ఇబ్బంది పెడితే ఆ దేవుడు కూడా క్షమించడన్నారు.
15 రోజుల్లో తేల్చకుంటే పోరాటం ఉధృతం చేస్తాం : ఎం.నరసింహ
సెకండ్ ఎఎన్ఎంలకు 41 వేల వేతనంతో పాటు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరైన సెకండ్ ఎఎన్ఎం దురదృష్టవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియమాకాన్ని ఆరు నెలల్లోపు అందించాలని ఎఐటియుసి రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను 15 రోజుల్లో నెరవేర్చకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 16 గంటల పని చేస్తున్నారని, 36 రికార్డులతో పాటు 18 మొబైల్ యాప్లను వారు నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుత కాలంలో శ్రమ దోపిడికి గురవుతున్న వారు ఎవరైన ఉన్నారంటే అది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెండో ఎఎన్ఎంల యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు బడేటి వనిజ, ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిడుమూరి విజయ, ఉపాధ్యక్షురాలు మంజల, పుష్పలత, ప్రవీణ, శారదా, స్వప్న, చంద్రకళ, తులసి, అరుణ, సరళ, సంగీత తదితరులు పాల్గొన్నారు.
రెండో ఎఎన్ఎంల సర్వీసులను..రెగ్యులరైజ్ చేయాలి
RELATED ARTICLES