HomeNewsTelanganaరూ.36వేల కోట్లు

రూ.36వేల కోట్లు

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన వ్యాపార సంస్థలు
రాష్ట్రంలో త్వరలో ఇంటిగ్రేటెడ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ స్కిల్లింగ్‌ వర్సిటీని ఏర్పాటు చేయనున్న అదానీ గ్రూప్‌
కంపెనీ నిర్వాహకులు, సిఇఒలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు ముందుకొచ్చాయి. సుమారు రూ.36,600 కోట్ల వరకు వివిధ కంపెనీలు, సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో అదానీ గ్రూప్స్‌ రూ. 12,400 కోట్లు, ఆరాజెన్‌ రూ. 2వేల కోట్లు, గోడి ఇండియా రూ. 8వేల కోట్లు, జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ రూ.9వేల కోట్లు, ఐరెన్‌ మౌంటేన్‌ సంస్థ రూ. 5200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. త్వరలోనే అదానీ గ్రూప్స్‌ తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటేడ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ స్కిల్లింగ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వివిధ కంపెనీల నిర్వాహకులు, సిఇఒలతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదర్చుకున్నది. దావోస్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో పలు కంపెనీలతో ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదర్చుకున్నది. దావోస్‌లో పాల్గొన్న కంపెనీలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించగా పలు కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడాన్ని ఆయన స్వాగతించారు.
దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్‌ రెడ్డి, ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమక్షంలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఏరోస్పేస్‌, ఫెన్స్‌ సీఈవో ఆశిష్‌ రాజ్వంశీ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
తెలంగాణలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం నిమిత్తం రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కొనెక్స్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటు కోసం రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అలాగే అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్‌,డిఫెన్స్‌ పార్క్‌ లో కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్స్‌, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది.
కాగా ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, కావాల్సిన సహాయ సహకారాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అదానీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ ఆనంద్‌ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉన్నదని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్‌ మరింత వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రెటరీ విష్ణు వర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.
త్వరలోనే తెలంగాణలో ‘స్కిల్‌ యూనివర్సిటీ’
యువకులలో నైపుణ్యతను పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని( స్కిల్‌ యూనివర్సిటీ ) ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కోరారు. యువత నైపుణ్యాలు అభివృద్ధి చెందితే, పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. అందుకు గౌతమ్‌ అదానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ స్కిల్లింగ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.కాగా అదానీ నిర్ణయాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి స్వాగతించారు.
రూ.9వేల కోట్లతో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌
జెఎస్‌డబ్ల్యుఎనర్జీ అనుబంధ సంస్థ జెఎస్‌డబ్ల్యు నియో ఎనర్జీ, తెలంగాణలో రూ.9వేల కోట్ల పెట్టుబడితో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు జెఎస్‌డబ్ల్యు నియో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌ ఏర్పాటు అంశంపైన జెఎస్‌ డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ 1,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్‌ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుందన్నారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, భవిష్యత్‌ ప్రాజెక్టులపై సహకరించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి సజ్జన్‌ జిందాల్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్థ థర్మల్‌, హైడ్రో,సౌర వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
రూ. 8వేల కోట్లతో ‘గిగా స్కేల్‌ సెల్‌ తయారీ కేంద్రం’
గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ‘గిగా స్కేల్‌ బ్యాటరీ సెల్‌’ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీనికి సంబంధించి రూ.8వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌ లో 12.5 గిగావాట్‌ ఫర్‌ అవర్‌ సామర్థ్యముండే బ్యాటరీ సెల్‌ను తయారు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సిఇవో మహేష్‌ గోడి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. రాబోయే అయిదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్‌, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి, గిగా స్కేల్‌ సెల్‌ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్‌ అసెంబ్లింగ్‌ లైన్‌ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను ప్రోత్సహిస్తుందని సిఎం రేవంత్‌ అన్నారు.
‘ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలకు’ రూ.2వేల కోట్లు
రాష్ట్రంలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ. 2వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 1500 కొత్త ఉద్యోగాలను అందిస్తుందని ఆ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకునేందుకు కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌ స్థానం మరింత సుస్థిరమవనుంది. ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణతో హైదరాబాద్‌ దేశంలోనే కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ హబ్‌ గా మారనుంది.
ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సిఇవో మణి కంటిపూడి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఫార్మా రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. రాబోయే అయిదేళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించటం సంతోషంగా ఉందని కంపెనీ సిఇవో మణి కంటిపూడి అన్నారు.
రాష్ట్రంలో డేటా సెంటర్‌
తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ఐరన్‌ మౌంటెన్‌ అనుబంధ సంస్థ వెబ్‌ వర్క్‌ రూ.5200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్‌ వర్కింగ్‌ హెవీ డేటా సెంటర్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ. 1200 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. దీనికి అదనంగా రూ.4వేల కోట్లకు పైగా పెట్టుబడితో రాబోయే కొన్ని సంవత్సరాలలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. దీనికి అవసరమైన విద్యుత్‌ను కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని వివరించారు. ఐరన్‌ మౌంటేన్‌ సిఇవో విలియం మినీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం డేటా సెంటర్‌ను ,పునరుత్పాదక ఇంధనం రెండింటికీ మద్దతు అందించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిణీయంగా మార్చిందని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments