బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన శక్తిభోగ్ ఫుడ్స్
కేసు నమోదు చేసిన సిబిఐ
న్యూఢిల్లీ : మళ్ళీ బ్యాంకులు మోస పోయాయి. ఢిల్లీకి చెందిన శక్తి భోగ్ ఫుడ్స్ అనే ఒక సంస్థ పది బ్యాంకుల నుంచి 3,269 కోట్ల రూపాయల మేరకు తీసుకుని చివరకు కుచ్చుటోపీ తగిలించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదు మేరకు శక్తి భోగ్ ఫుడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కేవల్ కృష్ణకుమార్ సహా మరో ఇద్దరు డైరెక్టర్లు సిద్దార్థ కుమార్, సునంద కుమార్‌లపైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కేసు నమోదు చేసింది. శక్తి భోగ్ ఫుడ్స్ కంపెనీ 3,269 కోట్ల మేరకు మోసం చేసిందన్న ఆరోపణపై సిబిఐ కేసు నమోదు చేసినట్లు ఎస్‌బిఐ సారథ్యంలో ఉన్న పది బ్యాంకులతో కూడిన పెట్టు బడుల సహాయతా సంఘం తరపున ఎస్‌బిఐ అధికారులు శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలియజేయారు. బావిలో నీళ్ళు తోడుకుపోయినంత సులభంగా ప్రజా ధనాన్ని స్వాహా చేసేందుకు మోసపూరిత పద్ధతిలో ఫోర్జరీ చేసిన పత్రాలు, నకిలీ అకౌంట్లు బ్యాంకులకు సమకూర్చి బహిరంగ మోసానికి పాల్పడ్డారు. ఎస్‌బిఐ ఈ విషయాన్నే తన ఫిర్యాదులో సిబిఐకి తెలియజేసింది. 24 సంవత్సరాల క్రితం శక్తిభోగ్ ఫుడ్స్ కంపెనీ ఆవిర్భవించింది. గోధుమలు, గోధుమ పిండి, బియ్యం, బిస్కట్లు, ఇతర తినే పదార్థాలను సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసే ఈ కంపెనీ దశాబ్దకాలంగా ఆహార సంబంధమైన విభిన్న ఉత్పత్తులు చేసే వెంచర్ చేస్తూ 2008లో 1,411 కోట్ల టర్నోవరు పెరుగుదల స్థాయి నుంచి 2014లో 6,000కోట్ల టర్నోవరుకు చేరుకుందని ఎస్‌బిఐ అధికారులు విడుదల చేసిన ప్రకటన తెలియజేసింది. అయితే 2015లో ఈ టర్నోవరు పెరుగుదల ఆకస్మికంగా స్తంభించిపోయిందనీ, దాంతో కంపెనీ అకౌంట్లు మొండి బాకీల జాబితా (ఎన్‌పిఎ)లోకి చేరిపోయిందనీ, ఇక అంతిమంగా 2019లో కంపెనీ మోసానికి పాల్పడినట్లు తేలిపోయింది. పెట్టుబడుల వ్యయం కింద ఉపయోగించిన ధాన్యం, బియ్యం ధరలు గణనీయంగా పడిపోవడంతో కంపెనీ జాబితాకు రావాల్సిన అకౌంటులోకి డబ్బు రావడానికి తీవ్ర జాప్యం జరగడంతో అకౌంటు 2017లో ఎన్‌పిఎ జాబితాలోకి చేరింది. బ్యాంకు అధికారులు చేసిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో, 2015-16 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అకౌంటు పుస్తకాల్లో 3,000 కోట్ల రూపాయల మేరకు నష్టాలు వాటిల్లినట్లు చూపించారని బ్యాంకర్లు తెలిపారు. చీడపీడల కారణంగా సరుకు ధ్వంసం కావడంవల్ల, నిర్దేశించిన దానికంటే చాలా తక్కువ ధరలకు సరుకు అమ్ముడు కావడంవల్ల మూడువేల కోట్ల మేరకు నష్టాలు వాటిల్లినట్టు చూపించారు. కానీ కంపెనీలో 2015 సెప్టెంబరునాటికి స్టాకు 3,500 కోట్ల మేరకు ఉన్నట్లు ఆడిట్ నివేదిక పేర్కొంది. కంపెనీ నిల్వలకు, ఆడిట్ రిపోర్టుకు మధ్య చాలా వైరుధ్యం ఉందని తేలడం, గోదాములు పూర్తి నిలలతో ఉండటం, సరుకు నెమ్మదిగా మార్కెట్‌కు వెళుతోందని తేలిందని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.
రూ.3,269 కోట్లను మింగేశారు!
RELATED ARTICLES