రూటు మారని బస్సు

ఎపి, టిఎస్‌ఆర్‌టిసిల మధ్య కుదరని అవగాహన
అంతర్రాష్ట్ర సర్వీసులపై అభ్యంతరాలు
పలు ప్రతిపాదనలు చేసిన టిఎస్‌ఆర్‌టిసి
మరోసారి కొలిక్కిరాని చర్చలు
ప్రజాపక్ష ం / హైదరాబాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల మధ్య ఎపిఎస్‌ఆర్‌టిసి ఎన్ని అంతర్రాష్ట సర్వీసులను నడుపుతుందో అంతే సమానంగా తాము కూడా నడుపుతామని టిఎస్‌ఆర్‌టిసి స్పష్టం చేసింది. ఈ మేరకు ఎపిఎస్‌ఆర్‌టిసికి స్పష్టమైన ప్రతిపాదనలను సమర్పించింది. అంతర్రాష్ట సర్వీసులపై ఎపిఎస్‌ఆర్‌టిసి, టిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎపిఎస్‌ఆర్‌టిసి ఎన్ని రూట్లలో, ఎన్ని కిలోమీటర్లలో అంతర్రాష్ట సర్వీసులను నడుపుతుందో టిఎస్‌ఆర్‌టిసి కూడా అంతకు సమానమైన రూట్లు, కిలోమీటర్లలో ఆంత్రరాష్ట్ర సర్వీసులను నడుతుందని సమావేశంలో టిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రూట్లు, కిలోమీటర్ల విషయంపై చర్చించేందుకు మరోసారి రెండు రాష్ట్రాల ఆర్‌టిసిల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సమావేశం కావాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, రవాణాశాఖ ప్రత్యే క కార్యదర్శి విజయేంద్ర, ఎపిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ కష్ణబాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కోటేశ్వరరావులతో పాటు రెండు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆర్‌టిసి అంతర్రాష్ట్ర సర్వీసులపై తొలుత ఓ పర్యాయం విజయవాడలో, ఆ తర్వాత బస్‌భవన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల స్థాయిలో సమావేశాలు జరిగినప్పటికీ చర్చలు పూర్తిగా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు టిఎస్‌ఆర్‌టిసి కంటే లక్ష కిలోమీటర్ల మేరకు ఎక్కువగా అంతర్రాష్ట్ర ట్రిప్పులు తిరుగుతున్నాయని, ఇందుకు తెలంగాణ ఆర్‌టిసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని టిఎస్‌ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. రెండు ఆర్‌టిసిలు సమానంగా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేలా ఒప్పందం చేసుకోవాలని టిఎస్‌ఆర్‌టిసి అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనలు స్పష్టంగా ఎపిఎస్‌ఆర్‌టిసికి సమర్పించినట్లు వారు తెలిపారు. మరోమారు జరిగే సమావేశంలోనైనా సమస్య పరిష్కారం అవుతుందని తాము భావిస్తున్నామని టిఎస్‌ఆర్‌టిసి అదికారులు అంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?