HomeNewsTelanganaరాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కె.శ్రీనివాస్‌రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్‌గా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హనుమంతరావు ప్రభుత్వ ఉత్తర్వులు జిఓనెంబర్‌ 300 జారీ చేశారు. సీనియర్‌ సంపాదకులు, జర్నలిస్టు ఉద్యమ జాతీయ నాయకులు కలిమికొలన్‌ శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లాలోని పల్లెపహాడ్‌. ఆయన 1949 సెప్టెంబరు 7న అండమ్మ, రామిరెడ్డి దంపతులకు జన్మించారు. వారిది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న రైతు కుటుంబం. ఐదు దశాబ్దాలుపైగా తెలుగు పత్రికారంగం, జర్నలిస్టు ఉద్యమంలో కె.శ్రీనివాస్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. జర్నలిజం వృత్తి పట్ల అంకిత భావం, నైతిక విలువలు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం చేసిన రాజీలేని పోరాటాలకు ఆయన పెట్టింది పేరు.
విశాలాంధ్రతో ఆరంభం..
హైదరాబాద్‌లోని భవన్స్‌ న్యూ సైన్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలో హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (హెచ్‌ఎస్‌యు)లో చురుకుగా పని చేశారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) నాయకులుగా ఉన్నారు. అనంతరం 21 ఏళ్ళ ప్రాయంలోనే జర్నలిజంలోకి ప్రవేశించారు. ప్రముఖ చారిత్రక దినపత్రిక ‘విశాలాంధ్ర’లో హైదరాబాద్‌ స్టేట్‌ బ్యూరో స్టాఫ్‌ రిపోర్టర్‌ ఆయన 1970లలో జర్నలిస్టు వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించారు. నిబద్ధతతో పనిచేసి అదే పత్రికకు ఎడిటర్‌ స్థాయికి ఎదిగారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ‘మన తెలంగాణ’ దినపత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించారు. నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 2018లో ‘ప్రజాపక్షం’ ప్రారంభమైనప్పటి నుండి శ్రీనివాస్‌రెడ్డి ఎడిటర్‌గా కొనసాగుతున్నారు.
జర్నలిస్టు ఉద్యమ నేతగా…
పాత్రికేయ వృత్తిలో ప్రవేశించగానే దేశంలో జర్నలిస్టులకు ఉన్న అతిపెద్ద సంఘం ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (ఎపియుడబ్లుజె)లో కె.శ్రీనివాస్‌రెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు. అచిరకాలంలోనే 1985లో ఎపియుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పాటు పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల సంరక్షణతో పాటు కల్లోల కాలంలో పాత్రికేయుల రక్షణకు అండగా ఉద్యమాలు నిడిపారు. అనంతరం ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు) సెక్రెటరీ జనరల్‌గా ఎన్నికై జాతీయస్థాయిలో, వివిధ రాష్ట్రాలలో జర్నలిస్టు ఉద్యమాన్ని విస్తరింపజేశారు. ఆ తరువాత ఐజెయు అధ్యక్షులుగా ఎన్నికై, ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. పత్రికా స్వాతంత్య్రంకోసం, భావ ప్రకటనా స్వేచ్ఛకోసం, జర్నలిస్టుల పని పరిస్థితులు, వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడంకోసం జాతీయస్థాయిలో అనేక పోరాటాలు చేసిన ప్రముఖ నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డి. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ) సభ్యులుగా ఆయన రెండు విడతలు నియమితులయ్యారు.సెంట్రల్‌ ప్రెస్‌ అక్రెడిటేషన్‌ కమిటీ (సిపిఎసి)లలో ఐజెయు తరపున సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులుగా…
ఆంధప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ (కేబినెట్‌ హోదా) వ్యవస్థాపక చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి పనిచేశారు. పత్రికారంగ ప్రామాణికతలను మరింతగా అభివృద్ధి చేయడానికి, జర్నలిజం వృత్తి ప్రమాణాలు పెంపొందించేందుకు నిపుణులతో కింది స్థాయి వరకు అకాడమీ ఆధ్వర్యంలో పాత్రికేయులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే కె.శ్రీనివాస్‌రెడ్డి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే పాత్రికే వృత్తికి సంబంధించి అనేక పుస్తకాలను కూడా తీసుకువచ్చారు. వాటిలో తెలుగు జర్నలిస్టులకు ఆంగ్లం నుండి సరైన తెలుగు అర్థం సూచించే కరదీపిక ‘పత్రికా పదకోశం’ ప్రత్యేక ప్రస్తావనీయమైనది.
‘పెయిడ్‌ న్యూస్‌’ పద సృష్టికర్త
ఎన్నికల సమయంలో అనైతికంగా పత్రికల్లో కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే ‘పెయిడ్‌ న్యూస్‌’ రుగ్మతపై కె.శ్రీనివాస్‌ రెడ్డి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెంబర్‌గా గళమెత్తారు. పెయిడ్‌ న్యూస్‌ అనే పదానికి ఆయనే సృష్టికర్త. ఎపియుడబ్ల్యుజె, ఐజెయు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక అధ్యయన కమిటీ ఆధారాలతో సహా పెయిడ్‌ న్యూస్‌ను నిరూపిస్తూ సమర్పించిన నివేదిక జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పార్లమెంటు సహా సకల రంగాల నుండీ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘పెయిడ్‌ న్యూస్‌’పై ప్రత్యేక ఎడిటోరియల్‌ రాయడంతో పాటు దీనిని సాధికారికంగా నిరూపించిన జర్నలిస్టు సంఘం కృషిని ప్రశంసించింది. శ్రీనివాస్‌ రెడ్డి అమెరికా, సోవియెట్‌ యూనియన్‌, చైనా, క్యూబా వంటి అనేక దేశాలను వృత్తిలో భాగంగా పర్యటించారు. నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సహా ఇద్దరు ప్రధానమంత్రుల అధికారిక విదేశీ పర్యటనలలో ఎంపిక చేసిన పాత్రికేయ బృంద సభ్యులుగా ఆయన వారితో కలిసి ప్రధాని ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్ళారు. రాజకీయ విశ్లేషకుడుగా ఆయన దాదాపు ప్రతిరోజూ అన్ని టీవీ ఛానళ్ళలోనూ నిష్పక్షపాతంగా , సరళంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని ప్రతీతి. జర్నలిజంలో వృత్తిప్రమాణాలు సాధించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(మెఫీ)కు వ్యవస్థాపకులలో ఒకరిగా ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments