నీతి ఆయోగ్ ప్రతిపాదించినా రాష్ట్రానికి రూపాయి ఇవ్వలే
సంపదను గద్దలకు, కార్పొరేట్ శక్తులకు తాము పంచడంలేదు
బిజెపి సర్కార్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వాటా,అప్పులు, వివిధ రూపాల్లో రావాల్సిన రూ.1,05,812 కోట్లను ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం, ప్రజలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. విఫలం, విషం, విద్వేషమే బిజెపి సారాంశమని, తమది సఫలం, సంక్షేమం, సామరస్యమని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు
దొందు దొందేనని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎపి పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. “ఎపి పునర్విభజనచట్టం హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు’ , ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి-రాష్ట్ర ప్రగతిపై ప్రభావం”అనే అంశంపైన శాసనసభలో మంగళవారం లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. రాష్ట్రానికి నిధులను ఇవ్వాలని నీతిఆయోగ్ కేంద్రానికి ప్రతిపాదించినా రూపాయీ ఇవ్వలేదని, ఎంఆర్‌బిఎం కింద రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచామని కేంద్రం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి రాష్ట్రానికి వచ్చిన వాటా 29.6 శాతమేనని వివరించారు. రాష్ట్రాలకు సెస్ వాటాను తగ్గించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ. రూ. 33,712 కోట్ల నష్టం జరిగిందన్నారు. సంపదను కేంద్రం ప్రభుత్వం తరహా గద్దలకు, కార్పొరేట్ శక్తులకు తాము పంచడం లేదని, పేదలకు పంచామని తెలిపారు. సకలజనుల లబ్ధి కోసమే తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కేంద్రం ద్వంద్వ నీతిని వ్యవహారిస్తోందన్నారు.
దేశానిన, ఇతర రాష్ట్రాలను సాదుతున్న తెలంగాణ
రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లను చెల్లిస్తుండగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 1,96,448 కోట్లు మాత్రమే వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రం ప్రతి రూపాయిలో కేంద్రానికి 47 పైసలు చెల్లిస్తోందన్నారు. తెలంగాణనే ఇతర రాష్ట్రాలను, దేశాన్ని సాదుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతాయుతంగానే అప్పులు చేస్తున్నామని, తీసుకున్న అప్పులకు సకాలంలో వాయిదలను కూడా చెల్లిస్తున్నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు పెండింగ్ పెట్టారని, వ్యాట్ అమలులో ఉంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదని, జిఎస్‌టి వల్ల రాష్ట్రానికి నష్టమే ఎక్కువగా జరిగిందని వివరించారు. రాష్ట్ర అప్పుల్లో కలిపి జిఎస్‌టి పరిహారాన్ని చెల్లించారన్నారు. కేంద్రం 2017-18లో రూ.81వేల కోట్లు, 2018-19లో రూ.1.58 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం కోసం ఔటాఫ్ బడ్జెట్ అప్పులు తీసుకున్నట్టు కాగ్ తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం చేసిన అప్పు రూ. 1,52,17, 910 కోట్లు అని, ప్రతి పౌరునిపైనా రూ. 1,25,679 భారం పడుతుందని, తెలంగాణ రాష్ట్రం రూ.3,29,980 కోట్లు అప్పు చేసిందని, ఈ లెక్కనరూ. 94,272 ఉంటుందని వివరించారు. ఏడేళ్లలో కొత్తగా 7 ఐఐఎంలు, ఐఐటిలను, రెండు ఐఐఎస్‌ఈఆర్‌లను, 16 ట్రిపుల్ ఐటీలను, నాలుగు ఎన్‌ఐడీలను, 157 మెడికల్ కాలేజీలను, 84 నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సున్నా అని విమర్శించారు. వీటిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని బిజెపి ఎంపిలు చేస్తున్న కృషి పెద్ద గుండు సున్నాఅ ని ఎద్దేవా చేశారు. కేంద్ర సవరణలు కేంద్రానికి ఒక నీతి, రాష్ట్రానికి మరో నీతినా అని ధ్వజమెత్తారు.
బిజెపిది మతం మంటలు
పచ్చని పంటల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరితపిస్తుంటే, మతం మంటలు పెట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. పొలాలకు నీళ్లు పారించాలని తమ ప్రభుత్వం పరితపిస్తుంటే, మత ఘర్షణలతో తలలు పగిలి నెత్తురు పారాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. దేశ ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, విదేశీ మారక ద్రవ్య నిలువలు అడుగంటిపోతున్నాయని, రూపాయి అంపశయ్య మీద ఉన్నదని తెలిపారు. రాకెట్ వేగంగా గ్యాస్, డీజీల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, కానీ అసలు జీడీపీ పెరగడం లేదని అన్నారు. ప్రజల ఆస్తులను కేంద్రం అడ్డికి పావుసేరు చొప్పున విక్రయిస్తోందన్నారు. అమ్మి పారేయడమే బిజెపి మార్క్, సంస్కారమని, ఇదే బిజెపి మార్క్ దేశ భక్తిఅని ఎద్దేవా చేశారు. కేంద్రం తన వైఫల్యాల చరిత్రను కప్పిపుచ్చుకునేందుకే విద్వేశ రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర
RELATED ARTICLES