21న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన
న్యూఢిల్లీ: అధికార ఎన్‌డిఎ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్న రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. దేశ వ్యాపంగా సుమారు 4,800 మంది ఎంపిలు, ఎంఎల్‌ఎల్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఓటింగ్ జరుగుతుంది. 21న ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. కొత్త రాష్ట్రపతి ఈనెల 25న పదవీబాధ్యతలు స్వీకరిస్తారు. ముర్ముకు బిజెపితోపాటు బిజెడి, వైఎస్‌ఆర్‌సిపి, బిఎస్‌పి, ఎఐఎడిఎంకె, టిడిపి, జెడిఎస్, శిరోమణి అకాలీదళ్, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంది. ఎన్‌డిఎకు సొంతంగా 6.67 లక్షల ఓట్లు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా జతకలవడంతో
బలం 10.86 లక్షలకు పెరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, రాష్ట్రపతి పదవికి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎన్నికల చట్టం 1952లోని సెక్షన్ 4 సబ్-సెక్షన్ (3)లోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న అరవై రోజుల వ్యవధిలో ఏ రోజైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన మరుసటి రోజే ఎన్నికైన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించే విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. ఆర్టికల్ 58 ప్రకారం, రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి భారత పౌరుడిగా ఉండాలి. ఆ వ్యక్తి వయస్సు కనీసం 35 సంవత్సరాలు ఉండాలి. లోక్‌సభ సభ్యునిగా పోటీ చేయానికి ఉండాల్సిన అర్హతలన్నీ తప్పనిసరిగా ఉండాలి. భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయకమైన పదవిలో ఉండకూడదు. అంతేగాక, నామినేషన్ దాఖలు చేయడానికి అనేక షరతులు పాటించాలి. సదరు అభ్యర్థికి కనీసం యాభై మంది ఎంఎల్‌ఎలు, ఎంపిల మద్ధతు ఉండాలి. రూ. 15,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రాష్ట్రపతి ఎన్నికలలో ఒక ఎలక్టర్ ఒక అభ్యర్థి పేరును మాత్రమే ప్రతిపాదించే అవకాశం ఉంది. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 ప్రకారం, రాష్ట్రపతి పదవీ కాలం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కొత్త రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించే వరకు కూడా పదవిలో కొనసాగవచ్చు. రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉండకూడదనే నిబంధన ఉన్నందున, కొత్త రాష్ట్రపతి పదవీబాధ్యతలు స్వీకరించడానికి ముందు రోజుతో తాజామాజీ రాష్ట్రపతి పదవీకాలం ముగుస్తుంది.
రాష్ట్రపతి ఎన్నిక నేడే
RELATED ARTICLES