రాష్ట్రంలో ‘మళ్లీ లాక్డౌన్’ నకిలీ జిఒ సృష్టికర్త అరెస్ట్
తప్పుడు పోస్ట్‌లు పంపితే గ్రూప్ అడ్మిన్లపైనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ‘లాక్డౌన్’ అం టూ ప్రభుత్వం పేరుతో నకిలీ ఉత్తర్వులను సృ ష్టించి, వాట్సాప్‌లో పోస్ట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్‌ను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌ను, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఇలాంటి పోస్ట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాలు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని, కానీ ఇలాంటి తప్పుడు పోస్ట్‌లను గ్రూప్‌ల్లో పంపితే గ్రూప్ అడ్మిన్లను కూడా నిందితుల జాబితాలో చేర్చాల్సి వస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను అంజనీకుమార్ వెల్లడించారు. నెల్లూర్ టౌన్‌కు చెందిన శ్రీపతి సంజీవ్‌కుమార్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసముంటున్నాడు. కార్వి అండ్ కాం సంస్థలో సిఎగా పని చేస్తున్నాడు. గత ఏడాదిలో విధించిన లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రభుత్వ జిఒను ఆన్లైన్ ద్వారా సంజీవ్‌కుమార్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో తాజా తేదీని మార్ఫింగ్ చేసి మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ప్రభుత్వం జారీ చేసినట్టుగా నకిలీ ఉత్తర్వులను సృష్టించాడు. దీనిని ఈ నెల 1న వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. తన గ్రూప్‌లోని 40 సభ్యులకు పోస్ట్ చేశాడు. ఆ జిఒను ప్రభుత్వమే జారీ చేసిందనుకుని వారు తమ గ్రూప్స్‌లలో ఫర్వార్డ్ చేశా రు. మళ్లీ లాక్డౌన్ విధించనున్నట్టు సోషల్ మీడియాలో ఆ జిఒ వైరల్‌గా మారింది. దీంతో ఇదంతా తప్పు అని, లాక్డౌన్ విధించడంలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా దీనిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిసిఎస్ ఎసిపి కెవిఎం ప్రసాద్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ పి.రాజేష్ ఎస్ఐలు పి.మల్లిఖార్జున్, ఎన్.రంజీత్ కుమార్, షేక్ఖవీదుద్దీన్, సిసిఎస్ ఎస్ఐ జి.సతీష్‌రెడ్డి బృందం నకిటీ జివోను పోస్ట్ చేసిన వాట్పాస్ గ్రూప్‌లపై ఆరా తీసింది. ఇందులో భాగంగా 1800 సెల్ ఫోన్స్‌ను పరిశీలించగా అసలు సూత్రధారులను గుర్తించింది.
నిర్ధారించుకున్న తర్వాతనే ఫర్వార్డ్ చేయండి
మళ్లీ లాక్డౌన్ అంటూ ప్రజలను భయందోళనకు గురిచేసేలా ఇలాంటి తప్పుడు ఉత్తర్వుల ప్రభావం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలపైన పడుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. పలు వ్యాపారులు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చేవారు. ప్రజలు భయందోళన చెందే అవకాశాలు ఉంటాయన్నారు. ఇలాంటి వార్తలు, సమాచారాన్ని ముందుగా నిర్ధారించుకున్న తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని సూచించారు.