రాష్ట్రంలో బిజెపికి ఏముందని భయపడాలె?

మున్సిపల్‌ ఎన్నికల్లో 600కు పైగా స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులే లేరు
సోషల్‌మీడియా కార్యకర్తల సమావేశంలో కెటిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తనకు ప్రధాని మోడీ, రాహుల్‌ అన్నా ఏం భయం లేదని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు అన్నారు. రాష్ట్రంలో బిజెపికి ఏముందని తాను భయపడాలని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆరు వందలకుపైగా స్థానాల్లో బిజెపి తమ అభ్యర్థులను నిలుపలేక పోయిందని ఎద్దేవా చేశారు. మకర సంక్రాంతితో ప్రతిపక్షాల భ్రాంతి తొలగాలన్నారు. టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి కెటిఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌కు సోషల్‌ మీడియాలో పెయిడ్‌ వర్కర్స్‌ లేరని, టిఆర్‌ఎస్‌పైన అభిమానంతో ప్రేమ తో సోషల్‌ మీడియా సైనికులు పని చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో వాస్తవాలను వివరించింది కూడా మన సోషల్‌ మీడియా కార్యకర్తలేనని గుర్తు చేశారు. కొన్ని పార్టీలకు పెయిడ్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు తప్ప అభిమానులు లేరని ఆరోపి ంచారు. కొందరు ,కొన్ని పార్టీలు చిచ్చు పెట్టేందుకే సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియా ద్వారా ఉద్రిక్తతలు పెంచేందుకు వాడుకోలేదన్నారు. టిఆర్‌ఎస్‌కు సోషల్‌ మీడియాలో 11 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారన్నారు. ఏ పార్టీ మనకు దరిదాపుల్లో కూడా లేదన్నారు. సోషల్‌ మీడియాకు ఇప్పుడున్న పదును గతం లో ఎపుడూ లేదన్నారు. టిఆర్‌ఎస్‌ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని పునరుద్ఢాటించారు. ప్రజల్లో ఏ బలం లేకుండా కేవలం సోషల్‌ మీడియాతో పార్టీలు మనుగడ సాధించలేవని చెప్పారు. ప్రజల్లో ఆదరణ ఉండే పార్టీకి సోషల్‌ మీడియా అదనపు బలంగా ఉంటుందన్నారు. సిఎం కెసిఆర్‌ కూడా సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉంటారని, పబ్లిక్‌ పల్స్‌ తెలుసుకునేందుకు సోషల్‌ మీడియా ఒక సాధనమని సిఎం నమ్ముతారని కెటిఆర్‌ వివరించారు. సోషల్‌ మీడియా లో వాస్తవాలను వివరించాలని, దూషణల పర్వం కాదని, .దూషణలను ఎపుడూ టిఆర్‌ఎస్‌ ప్రోత్సహించదని తెలిపారు. టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలకు వేధింపులు వస్తే పార్టి పూర్తి అండగా ఉంటుందని భరోసనిచ్చారు. సోషల్‌ మీడియా కార్యకర్తలకు పార్టీకి మధ్య సమన్వయం పెరగాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?