రాష్ట్రంలో కరోనా కల్లోలం!

ఒకే రోజు 206 కరోనా కేసులు
రాష్ట్రంలో ఇప్పటికిదే రికార్డు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నది. శనివారంనాడు కొత్తగా, ఊహించనిరీతిలో 206 కేసులు నమోదయ్యా యి. మరో పది మంది ప్రాణాలు కోల్పోయా రు. తాజాగా నమోదైన కేసుల్లో 152 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి. అలాగే గ్రేటర్‌ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 10, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 18 కేసులు నమోదు అయ్యాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌, దాని పరిధిలోని మూడు జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. మిగిలిన కేసులకు సంబంధించి నిర్మల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఐదేసి కేసులు, మహబూబ్‌నగర్‌లో నాలుగు కేసులు, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో రెండేసి కేసులు, అలాగే మహబూబాబాద్‌, వికారాబాద్‌, జనగామ, గద్వాల, నల్గొండ, బద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వరంగల్‌ రూరల్‌ మాత్రమే నేటికీ కరోనా రహిత జిల్లాగా మిగిలిపోయింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3496కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 1663 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా శనివారంనాడు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 123కి పెరిగింది. ఇప్పటివరకు 1710 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. వలసలు, ప్రవాసులకు సంబంధించి ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు.

DO YOU LIKE THIS ARTICLE?