ఇదంతా ఓట్లకోసమే అని ప్రజలకు చెబుతాం
ఓ ఇంటర్వ్యూలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూఢిల్లీ : రామ మందిరం చుట్టూ బిజెపి ఒక ఉన్మాదాన్ని సృష్టిస్తున్నదని భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. ఇదంతా కేవలం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే అనే సత్యాన్ని తాము ప్రజల్లో ప్రచారం చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ‘ఇండియా’ కూటమి ఛైర్మన్‌గా ఎంపికచేస్తూ భాగస్వామ్యపార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన కొద్ది రోజులతర్వాత డి.రాజా ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆంగ్ల దినపత్రిక ప్రతినిధి ప్రీతీ నాయర్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో రానున్న లోక్‌సభ ఎన్నికలు, దేశ రాజకీయాలపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
రానున్న ఎన్నికలకు ప్రతిపక్షం ఎలా సన్నద్ధం అవుతోంది?
‘ఇండియా’ కూటమి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఈ కూటమిలోని భాగస్వామ్యపార్టీలన్నీ చాలా బలమైన చిత్తశుద్ధితో ఉన్నాయి. లౌకిక, ప్రజాస్వామ్య భావాలకు కట్టుబడిన పార్టీలన్నీ తప్పనిసరిగా ఒక్కచోట చేరాలి. ఐక్యత ప్రదర్శించాలి. బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి. భాగస్వామ్యపార్టీలమధ్య ఇష్టాగోష్ఠిగానో, లాంఛనపూర్వకంగానో సీట్ల సర్దుబాట్లపై సంభాషణలు జరుగుతున్నాయి. భాగస్వామ్యపార్టీలన్నీ ఒక్కచోట చేరి సమష్టిగా కూర్చుని దీనికి సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేస్తాయి. రానున్న రోజుల్లో ఇదంతా జరుగుతుంది.
ప్రతిపక్షం తనను ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది, కానీ ప్రతిపక్షం గందరగోళంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది?
‘ఇండియా’ కూటమి ఇటీవల జరిపిన సమావేశంలో పలు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. వాటిల్లో మల్లికారున ఖర్గేను ఛైర్మన్‌గా, నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఖర్గే పేరును ఏకగ్రీవంగా అందరూ అంగీకరించారు. అయితే మొన్న జరిగిన సమావేశానికి హాజరు కాలేకపోయిన తృణమూల్ కాగ్రెస్, సమాజ్‌వాదీపార్టీ నాయకులను సంప్రదించిన తర్వాత కన్వీనర్ పదవి భర్తీపై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం భావించింది.
బిజెపి తన అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటిస్తోంది, బహుశా ఈ నెలాఖరుకు….?
అది వారికున్న స్వతంత్య్రం. వారి పార్టీకి ఉన్న విశేషాధికారం అది. మేం కూడా రానున్న ఎన్నికల నిమిత్తం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. రాష్ట్రాలలో మా పార్టీ శాఖలు ఇప్పటికే సీట్ల సర్దుబాటు చర్చల్లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు పూర్తి కాగానే లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభం అవుతుందని అన్ని పార్టీలకూ బాగా
తెలుసు. అన్ని రాజకీయపార్టీలూ ఈ అత్యవసరాన్ని గ్రహించే మెలుగుతున్నాయి. అందుకు అనుగుణంనే మా పార్టీ కూడా సన్నద్ధంగా ఉంది.
కాంగ్రెస్ రెండుసార్లు చర్చలు చేశాక కూడా సీట్ల ఒప్పంద ప్రకటన చెయ్యలేదు..?
అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎవరెన్ని చెప్పినా దేశంలో ఉన్నవన్నీ స్వతంత్ర రాజకీయ పార్టీలే. బహుళ రాజకీయపార్టీలున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపార్టీ పార్లమెంటు, అసెంబ్లీలలో తమ తమ సీట్ల వాటా ఉండాలనే కోరుకుంటాయి. అందువల్ల సంప్రదింపులు తప్పనిసరిగా జరుగుతాయి.
బీహార్‌లో సీట్లసర్దుబాలు చర్చలు మొదలయ్యాయా?
జెడి(యు) నాయకుడు నితీశ్ కుమార్, ఆర్‌జెడి నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లతో మేం ప్రాథమికంగా చర్చలు జరిపాం. వామపక్షాలు వారికి న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు రాబట్టుకుంటాయి. మన పార్టీలన్నీ న్యాయబద్ధమైన, వాస్తవ ప్రాతిపదికపై తమ వైఖరులు వెల్లడిస్తాయి. పార్టీలన్నీ కూడా ఈ విషయంలో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వ్యవహరిస్తాయని నేను భావిస్తున్నాను.
పశ్చిమ బెంగాల్ లాంటిచోట్ల కూటమికి సమస్యలు ఉత్పన్నమవుతాయా?
రాష్ట్రాలస్థాయీలో సీట్లసర్దుబాటు చర్చలు జరిగినప్పుడు కొన్ని సమస్యలు రావొచ్చు. కానీ స్థానిక స్థాయిలోనే వాటిని పరిష్కరించుకుంటారు. ఈ విధంగా ‘ఇండియా’ కూటమి ఎన్నికల ప్రయోజనాలపై ఏ విధంగానూ వాటి ప్రభావం ఉండదు.
కేరళలో వయనాడ్ నుండి రాహుల్‌గాంధీని పోటీ చెయ్యొద్దని సిపిఐ కోరుతోంది, మీరేమంటారు?
అక్కడ అలాంటి అభిప్రాయం ఒకటి వచ్చింది. రాహుల్‌గాంధీ అంతటి సమ్మోహిత, శక్తిసామర్థ్యాలున్న నాయకుడు ఉత్తరాది రాష్ట్రాల నుండి బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేస్తే బాగుంటుందన్నది ప్రజల అంచనా. ఇతర రాష్ట్రాలలో, ప్రాంతీయ, లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు ఇప్పటివరకూ చాలా బలంగా ఉన్నాయి. దీనిపై రాహుల్‌గానీ, కాంగ్రెస్‌పార్టీగానీ స్పందించలేదు. ఈ అభిప్రాయం కేవలం భారత కమ్యూనిస్టుపార్టీలో మాత్రమే రూపుదిద్కుకోలేదు, ఇతరు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల మేం కాంగ్రెస్‌పార్టీ సమాధానం కోసం ఎదురుచూస్తాం.
చర్చలు జరుగుతుంటే రాహుల్ యాత్ర చేపట్టారు కదా, సమయం చాలదని కొందరంటున్నారు, మరి ఎన్నికల ప్రయోజనాలు నెరవేరతాయా?
రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్ర కూడా ఒక ప్రచార కార్యక్రమమే కదా? ఈ యాత్రలో కూడా ప్రజల సమస్యలను ప్రస్తావిస్తారు. ఈ యాత్రకు హాజరు కావాలని, తమకు మద్దతుగా ఉండాలని కాంగ్రెస్‌పార్టీ “ఇండియా” కూటమి నాయకులను కోరింది. వివిధ ప్రాంతాలలో పార్టీల నాయకులు అందరూ యాత్రల్లో తమకు అనుకూలమైన సమయాలలో వచ్చి పాల్గొనాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఇది ఒక ఉమ్మడి ప్రచార యాత్ర. సీట్ల సర్దుబాట్లకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో మేం మా నాయకులను పంపించాం. సీట్ల సర్దుబాటు చర్చలకుగానీ, ఎన్నికల సందడికిగానీ రాహుల్‌గాంధీ యాత్ర ఏ మాత్రం అడ్డుకాదు.
అయోధ్యకు ప్రతిపక్షాలు ఆహ్వానాన్ని తిరస్కరించడంపై బిజెపి విమర్శల దాడి చేస్తోంది, ఇదేమైనా ప్రతిపక్ష ఎన్నికల అవకాశాలను దెబ్బతీస్తాయని భావిస్తున్నారా?
ఇది కేవలం బిజెపి సంబంధించిన విషయం మాత్రమే. ప్రతిపక్షాలు ఏవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాయి? ఎన్నికల్లో ప్రతిపక్షాల గెలుపు అవకాశాలపై ఇది ప్రభావం చూపిస్తుందని నేనేమీ అనుకోవడం లేదు. రామ మందిరం సమస్య చుట్టూ బిజెపి ఒక ఉన్మాదాన్ని సృష్టిస్తున్నది. దీనికి సంబంధించిన వాస్తవాలన్నింటినీ ప్రజలకు మేం వివరించి చెబుతాం, బిజెపి చేస్తున్నదంతా ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయోజనం కోసమే.
‘ఇండియా’ కూటమికి ఉన్నది ‘ప్రధాని వ్యతిరేక’ ఎజెండా ఒక్కటే అని బిజెపి అంటోంది?
మా ఎజెండా మోడీ వ్యతిరేక ఎజెండా కాదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరుతో బిజెపి ఒక వ్యక్తి ఆరాధనను పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. మా ఎజెండా ప్రధానగా దేశంలో జీవన మనుగడ సమస్యలు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం.
‘ఇండియా’ కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని విమర్శ…
గతంలో ఐక్యసంఘటన కూటమి ఏర్పడినప్పడు కూడా ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని, ప్రధానమంత్రి అభ్యర్థినీ ఎన్నికల తర్వాతే నిర్ణయించాం. ప్రతి విషయాన్ని ఎన్నికల తర్వాతే కూటమిలోని పార్టీలన్నీ సమష్టిగా నిర్ణయిస్తాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు పార్టీల నైతికస్థుర్యైన్ని దెబ్బతీశాయా?
ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నుండి మేం గుణపాఠాలు నేర్చుకున్నాం. సీట్ల సర్దుబాటు చర్చలు, ఐక్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటవన్నీ మరింత సమర్థవంతంగా జరుగుతాయి. కాకపోతే తెలంగాణలో మాత్రం పరిమితమైనఅవగాహన ఉంది, అక్కడ సీట్ల సర్దుబాటు సంభాషణలు లేవు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా చత్తీస్‌గఢ్‌లలో ఐక్యంగా కలిసి పనిచేస్తున్నాం.