రాజ్యాంగ రక్షణకు యుద్ధం: సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా
ప్రజాపక్షం/ కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా నగర్ (విజయవాడ)
రానున్నదంతా పోరాటకాలమేనని, దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అసలు సిసలు పోరాటం చేస్తామని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. పోరాటమంటే ఆషామాషీగా కాదని, వీధుల్లోకి వస్తామని, ఫాసిస్టు, మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచి, పెద్దఎత్తున సమీకరిస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు, పోరాడేందుకు లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులు, పార్టీలను కలుపుకునేందుకు విసృ్తత ప్రయత్నాలు చేస్తామన్నారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, ఎపి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలతో కలిసి విజయవాడలో జరిగిన సిపిఐ 24వ జాతీయ మహాసభలో రెండవసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమ, ఉత్సాహం జాతీయ మహాసభలో ప్రస్ఫుటమైనదని రాజా అన్నారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికమైనదని, రాజ్యంగవిరుద్ధమైనదని, మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని, ప్రజలు ఫాసిజం దుష్పలితాలను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జాతీయ మహాసభలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటలకు స్పష్టమైన పిలుపునిచ్చిందని, ప్రజలు కూడా మౌన ప్రేక్షకులుగా కాకుండా ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి మోడీ ప్రభుత్వం అత్యంత ప్రమాకరమైనదని,భారత సమాజ లౌకిక స్వభావాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నదన్నారు. నయా ఉదారవాద విధానాలను ఉదృతంగా అమలు చేయడంతో పాటు ఆర్‌ఎస్ ఎస్ ఫాసిస్టు ఎజెండాను కూడా అమలు పరుస్తోందన్నారు.
నూతన నాయకత్వంపై అనేక ఆకాంక్షలు
తనను ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నుకున్నందుకు నూతన జాతీయ సమితికి డి.రాజా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నిక అనంతరం ఆయన మహాసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని నూతన నాయకత్వంపై అనేక ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు తీవ్ర కృషి చేస్తామని చెప్పారు. సిపిఐ పోరాట పార్టీగా ఉద్భవించేందుకు, ముఖ్యంగా వామపక్షాలలో బలమైన పార్టీగా మారేందుకు నూతన నాయకత్వంపై ఉంచిన బాధ్యతలను ముందుకు తీసుకెళ్తామన్నారు.