రాణించిన శుభ్‌మన్‌

ఇండియా-ఎ 233/3, సఫారీలతో రెండో టెస్టు
మైసూర్‌: దక్షిణాఫ్రికా జరుగుతున్న రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఇండియా మంగళవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (5)ను ఎంగిడి ప్రారంభంలోనే పెవిలియన్‌ పంపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంక్‌ పంచల్‌ (6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. దీంతో భారత్‌ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, కరుణ్‌ నాయర్‌ తమపై వేసుకున్నారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. గిల్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. నాయర్‌ తన మార్క్‌ డిఫెన్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈ జోడీ కుదురుగా ఆడడంతో భారత్‌ కోలుకుంది. ధాటిగా ఆడిన గిల్‌ వరుస ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. గిల్‌ను కట్టడి చేసేందుకు సఫారీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌ 12 ఫోర్లు, సిక్స్‌తో 92 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. సెంచరీ చేరువగా వచ్చిన శుభ్‌మన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించాడు. మరోవైపు కరుణ్‌ నాయర్‌ పది ఫోర్లతో 78 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. కెప్టెన్‌ వృద్ధిమాన్‌ సాహా ఐదు బౌండరీలతో 36 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. దీంతో భారత్‌ తొలి రోజు సురక్షిత స్థితికి చేరుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?