ఐటి శాఖ మంత్రి కెటిఆర్
సిరిసిల్లలో అంబేద్కర్ భవనం ప్రారంభం
ప్రజాపక్షం/న్యూస్ నెట్‌వర్క్ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు కేంద్రంలోని మోడీ సర్కార్ గండికొడుతున్నదని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. రాజ్యాంగం అందరి సొత్తేగానీ, ఏ కొందరికో పరిమితం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్లలో గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన అంబేద్కర్ భవన్‌ను మంత్రి ప్రారంభించారు. దళితబంధు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్‌వాదులంతా హైదరాబాద్ వైపు చూసే రోజు ఎంతోదూరంలో లేదని కెటిఆర్ అన్నారు. రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతుల్లో ఉంచుకొని, రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నదని విమర్శించారు. అంబేద్కర్ కలలుకన్న సమాజాన్ని ఆవిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే ‘టీ ప్రైడ్’ను ప్రవేశపెట్టామని అన్నారు. ఈ పథకం కింద మూడు వేల మంది దళిత పారిశ్రామికవేత్తలకు రూ.200 కోట్ల విలువైన రాయితీలను అందించినట్టు చెప్పారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల గౌరవంతో, ఆ స్ఫూర్తిని సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, కేంద్ర సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని కెటిఆర్ ఆరోపించారు. బిజెపికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, వ్యవస్థలను కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నదని కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్నదని విమర్శించారు. అట్టడుగు వర్గాలకు అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, లోకంలో ఉన్నవి రెండే రెండు కులాలని, అవి ఉన్నోడు లేనోడు అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కెసిఱర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారన్నారు. సిద్దిపేటలో ఆనాడు ఎంఎల్‌ఎగా సియం కెసిఆర్ చేపట్టిన దళిత చైతన్య జ్యోతి స్పూర్తితో దళితబంధు పధకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దళిత బంధు ఒక విప్లవాత్మకమైన కార్యక్రమని భారత స్వాతంత్య్ర చరిత్రలో దళిత బంధు ఓ సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి లబ్దిదారుడు లాభాదాయక యూనిట్‌ను ఎంపిక చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. దళితబంధు కార్యక్రమాన్ని ఒక సవాలుగా అమలు చేస్తున్నామని, దీనిని విజయవంతం చేద్దామని ఆయన అన్నారు. మిగతా వర్గాలకు కూడా దళితబంధు లాంటి పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు.
రాజ్యాంగం అందరి సొత్తు
RELATED ARTICLES