రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌

న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్‌డిఎ అభ్యర్థి జెటి(యు)కి చెందిన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సోమవారం ఎన్నికయ్యా రు. హరివంశ్‌ సింగ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. ఆర్‌జెడి అభ్యర్థి మనోజ్‌ ఝాపై హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ విజయం సాధించారు. హరివంశ్‌ సింగ్‌ అట్టడుగు వర్గం నుం చి వచ్చిన మేధవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్‌ సింగ్‌ను ఆయన అభినందించారు. రాజ్యసభ డిప్యూ టీ చైర్మన్‌గా హరివంశ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష నేతలు సైతం హరివంశ్‌ను అభినందించారు. ఇక అంతకుముందు హరివంశ్‌కు మద్దతుగా బిజెపి చీఫ్‌ జెపి నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనోజ్‌ ఝాను బలపరుస్తూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా, తొలుత 2018లో కాంగ్రెస్‌ నేత బికె హరిప్రసాద్‌ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో పదవీకాలం ముగియడంతో మరోసారి పోటీలో నిలిచారు. హరివంశ్‌ తిరిగి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల మొదటి నుంచీ బిజెపి ధీమాగా ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్‌డిఎకు 113 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ విపక్షాల మద్దతు కూడగట్టంలో ఆ పార్టీ సఫలమైంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్‌డిఎ అభ్యర్థికి వైసిపి, టిడిపి మద్దతు ఇవ్వగా.. టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌కు దూరంగా నిలిచింది.

DO YOU LIKE THIS ARTICLE?