రాజీ లేదు

ఆందోళనలపై రైతు సంఘాల స్పష్టీకరణ
ఘాజీపూర్‌: మూడు సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని చట్టబద్ధం చేయడం వంటి తమ డిమాండ్లలో రాజీ ప్రసక్తే లేదని, వాటిని సాధించడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోమని పలువురు రైతు సంఘాల నేత లు స్పష్టం చేశారు. టిక్రి, సింఘు, ఘాజిపూర్‌ సరిహద్దుల్లో రైతులు వంద రోజులకుపైగా ఆం దోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నదని అన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో నిరసన తెలపడం ఒక ప్రాథమిక హక్కు అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్తున్నట్టు రైతుల ఆందోళన ఒకటిరెండు ప్రాం తాలకు మాత్రమే పరిమితం కాదని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నాయకుడు దర్శన్‌పాల్‌ స్పష్టం చేశారు. దేశం నలుమూలల నుంచి రైతులే కాకుండా, కార్మిక, ఉద్యోగ సంఘాలు, సమాఖ్యల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఉద్యమానికి మద్దతునిస్తున్నారని అన్నా రు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో రైతు సంఘాల నేతలు పర్యటించి, కేంద్ర సర్కారు దేశ వ్యవసా య రంగాన్ని దెబ్బతీసేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నదో వివరిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించడం ద్వారా రైతుల సంఘటిత శక్తిని చాటుతామని అన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) రాజేవాల్‌ విభాగం నేత బల్బీర్‌సింగ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను అణచివేసేందుకు బలగాలను మోహరిచ డం, హింసాత్మక విధానాలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. చర్చలకు తాము విముఖులం కాదని, అయితే, మూడు చట్టాలను రద్దు చేయకుండా ఎన్ని హామీలు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని అన్నారు. మూడు సాగు చట్టాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేవిగానూ, కార్పొరేట్‌కు కొమ్ముకాసేవిగానూ ఉన్నాయని అన్నారు. అందుకే, వాటిని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు.
ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభం
ముజాఫర్‌నగర్‌ నుంచి రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ ఆదివారం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగుతుంది. ఈనెల 27వ తేదీన ర్యాలీ ఘాజీపూర్‌ చేరుకుంటుంది. కాగా, మధ్యప్రదేశ్‌లో జరగబోయ మూడు భారీ ర్యాలీల్లో బికెయు నాయుకుడు రాకేశ్‌ తికాయత్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఉత్తరప్రదేశ్‌ మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోనూ ట్రాక్టర్ల ర్యాలీలుజరుగుతాయి. సోమవారం షోపూర్లో ర్యాలీ ఉంటుంది. 14న రెవాలో, 15న జబల్పూర్‌లో రాయలీలు కొసాగుతాయి. మరిన్ని ర్యాలీలను నిర్వహించే విషయంపై ఒకటిరెండు రోజుల్లో బికెయు నిర్ణయం తీసుకుంటుంది. ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రైతు సంఘాల నేతలు సభలను నిర్వహించి, మూడు సాగు చట్టాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి రైతులకు వివరిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?