లేకుంటే ఎర్రజెండా పాతి పంచుతాం
ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరిక
కరీంనగర్ రామకృష్ణ కాలనీలోని ప్రభుత్వ భూమిని పరిశీలించిన సిపిఐ నేతలు
ప్రజాఫక్షం / కరీంనగర్ బ్యూరో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామం లో ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే ఆ స్థలంలో ఎర్ర జెండాలు పాతి పేదలకు పంచుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్‌తో కలిసి చాడ వెంకట్‌రెడ్డి రామకృష్ణకాలనీలోని సర్వే నెంబర్ 556లో ఉన్న 97 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 2008 డిసెంబర్ 29న బడుగు, బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి సిఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, అప్పటి నుండి నిరుపయోగంగా ఉన్న ఈ స్థలంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ను కోరుతున్నామని, అలా చేస్తేనే దివంగత వైఎస్ఆర్కు గౌరవం దక్కించినవారవుతారని, తద్వారా ఈ ప్రాంతం పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేరుతుందన్నారు. ఇందు కోసం ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోనట్లయితే సిపిఐ ఆధ్వర్యంలో మండలంలో ఇళ్లు లేని నిరుపేదలను ఏకం చేసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నమూనాగా మాత్రమే అక్కడక్కడా కట్టారని, అలా కాకుండా ప్రతి గ్రామంలో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలంలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయని, ఇక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్‌పైనే ఉందన్నారు. ఈ స్థలంలో ప్రజలకు మౌలిక సదుపాయాలైన విద్యాసంస్థలు, వైద్య సదుపాయాల కోసం ఆసుపత్రి, ఉపాధి లభించే పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ప్రజాప్రయోజనాలకు ఉపయోగించకుండా ప్రభుత్వ భూముల అమ్మకాల్లో భాగంగా ఈ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వంపై ఎంతటి పోరాటాలైనా నిర్వహిస్తామని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. సిఎం కెసిఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి సమగ్ర సర్వే చేస్తామని గాలి మాటలు చెప్పారని, భూముల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వెబ్సైట్లో కూడా అన్ని తప్పులు ఉన్నాయన్నారు. అనేక చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కొంతమంది ఆక్రమించుకుంటున్నారని, సర్వే నెంబర్ల వారీగా సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భ్యులు సమ్మయ్య, జె.వి.రమణారెడ్డి, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్, మండల కోశాధికారి వంగళ భాస్కర్ రెడ్డి, నాయకులు కండే ఎల్లయ్య, శ్రీనివాస్, మహిళా సమాఖ్య నాయకురాలు కిన్నెర మల్లవ్వ, బీర్ల పద్మ, భారతి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.్ల
‘రాజీవ్‌స్వగృహ’ స్థలంలో పేదలకు ఇళు
RELATED ARTICLES