రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలు

జైపూర్‌ : రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌పై ఉప ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌ సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నా యి. అశోక్‌ తన వర్గానికి చెందిన ఎంఎల్‌ఎలను ప్రలోభాల కు లోనవకుండా కాపాడుకుంటున్నారు. రాజీ ఫార్ములాతో మెత్తబడిన సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రికి ఎంతవరకూ సహకరిస్తారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు గెహ్లాట్‌ నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం (సిఎల్‌పి) ముగిసింది. ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటిస్తూ సిఎల్‌పి సమావేశంలో ఎంఎల్‌ఎలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. భేటీ అనంతరం ఆయనకు మద్దతు పలికిన ఎంఎల్‌ఎలను

బస్సుల్లో రిసార్ట్‌కు తరలించారు. ఈ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన ఎంఎల్‌ఎలు అంతా సజావుగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 107 మంది ఎంఎల్‌ఎలు ఈ సమావేశానికి హాజరయ్యారని గెహ్లాట్‌ వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు తనకు 25 మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉందని ప్రకటించిన సచిన్‌ పైలట్‌తో ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పైలట్‌ మూడు ప్రధాన డిమాండ్లను అధిష్టానం ముందుంచారు. తన వర్గానికి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలకు మంత్రిపదవులు ఇవ్వాలని, కీలక హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని, పిసిసి చీఫ్‌గా తనను కొనసాగించాలని ఆయన పట్టుబట్టారు. మరోవైపు ప్రియాంక గాంధీ చొరవతో సచిన్‌ పైలట్‌తో హైకమాండ్‌ జరిపిన మంతనాలతో అసంతృప్త నేత మెత్తబడ్డారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. పార్టీతో అన్ని విషయాలను చర్చించిన మీదట సచిన్‌ పైలట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బిజెపికి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంఎల్‌ఎలు బిజెపికి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎంఎల్‌ఎలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో రెబెల్‌ నేత సచిన్‌ పైలట్‌ గహ్లాట్‌కు సహకరిస్తారా..లేక బిజెపి గూటికి చేరతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
గెహ్లాట్‌ వైపు 84 మందే : సచిన్‌ వర్గం
మరో వైపు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ చెబుతున్నంత మంది ఎంఎల్‌ఎల మద్దతు ఆయనకు లేదని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం పేర్కొంది. కేవలం 84 మంది ఎంఎల్‌ఎల మద్దతు మాత్రమే ఆయనకు ఉందని, మిగిలిన ఎంఎల్‌ఎలంతా తమవైపే ఉన్నారని తెలిపింది. పార్టీ అధిష్ఠానంతో తాను ఎలాంటి చర్చలూ జరపట్లేదని పైలట్‌ వెల్లడించారు. అధిష్ఠానం ముందు ఎలాంటి షరతులూ ఉంచలేదని పేర్కొన్నారు. బలప్రదర్శన నిర్వహించాలనుకుంటే అందుకు ముఖ్యమంత్రి నివాసం వేదికకాదని, అసెంబ్లీలో మాత్రమే అది చేపట్టాలని సచిన్‌ అన్నారు. ఒకవేళ తనకు తగిన సంఖ్యాబలం ఉన్నట్లయితే వారితో నేరుగా గవర్నర్‌ను ఎందుకు కలవలేదు? హోటళ్లకు ఎందుకు తరలించారు? అని ప్రశ్నించారు.
సచిన్‌కు పార్టీ తలుపులు తెరిచే ఉండాయ్‌
ఇదిలా ఉండగా, సచిన్‌ పైలెట్‌కు పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అధిష్ఠానం దూత, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా సోమవారం ప్రకటించారు. తమకు 30 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారంటూ ఢిల్లీలో క్యాంపు పెట్టిన డిప్యూటీ సిఎం సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. గత 48 గంటల్లో తాము సచిన్‌ పైలెట్‌తో టచ్‌లోనే ఉన్నామని, ఆయనతో సంప్రదిస్తూనే ఉన్నామని వెల్లడించారు. తామంతా ఓ కుటుంబమని, ఏవైనా సమస్యలు తలెత్తితే కలిచి కూర్చుని, ఐకమత్యంగా పరిష్కరించుకుంటామని ఆయన ప్రకటించారు. “కుటుంబంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే.. కుటుంబీకులతో కలిసి కూర్చొని చర్చించవచ్చు. సచిన్‌ పైలెట్‌తో పాటు ఇతర నేతలకు కూడా కాంగ్రెస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తరపున నేను ప్రకటిస్తున్నాను” అని ప్రకటించారు.

DO YOU LIKE THIS ARTICLE?