HomeNewsNationalరండి బాబూ...రండి అవినీతిపరులకు ‘బిజెపి మోడీ వాషింగ్‌ పౌడర్‌'

రండి బాబూ…రండి అవినీతిపరులకు ‘బిజెపి మోడీ వాషింగ్‌ పౌడర్‌’

బిజెపి ప్రభుత్వ తీరుతెన్నులపై కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు
ఇప్పటివరకూ 21 మంది నాయకులకు క్లీన్‌చిట్‌ ఇచ్చారని
పత్రికాగోష్ఠిలో పవన్‌ ఖేరా విమర్శ
న్యూఢిల్లీ : ముందుగా దర్యాప్తు సంస్థలను పంపి కేసులు పెట్టి ఆ తర్వాత బిజెపి సదరు వ్యక్తులను, నాయకులను తమ పార్టీలో చేర్చుకుని క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై శనివారం ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పత్రికాగోష్ఠిలో కాంగ్రెస్‌పార్టీ ప్రాక్టికల్‌ జోక్‌ పేల్చింది. పత్రికాగోష్ఠి వేదికపైకి ఒక వాషింగ్‌ మెషీన్‌ను తీసుకువచ్చి ప్రదర్శించి బిజెపి ప్రభుత్వ తీరు తెన్నులపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ సందర్భంగా పత్రికాగోష్టిలో పాల్గొన్న మీడియా ప్రతినిధులకు “మోడీ వాషింగ్‌ పౌడర్‌” పేరుతో మోడీ ముఖచిత్రం ముద్రించి ఉన్న లీఫ్‌లెట్‌లను కూడా పార్టీ నాయకులు పంచిపెట్టారు. దీనికిందనే “అన్ని రకాల అవినీతి మరకలూ క్షణాల్లో మటుమాయం” (సారే దాగ్‌ ఛుట్కియోన్‌ మే ధూలే) అని కూడా వ్యంగ్యంగా ముద్రించారు. 2017లో జరిగిన ఒక అవినీతి కేసులో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌పై సిబిఐ కేసు దాఖలు చేసింది. ఆ తదనంతర పరిణామాలపై కాంగ్రెస్‌పార్టీ సింబాలిక్‌గా పత్రికాగోష్ఠిలో వాషింగ్‌ మెషీన్‌ను తెచ్చి ప్రదర్శించి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బాగా మురికిపట్టిన అవినీతి, మోసం, కుంభకోణాలు అనే పేర్లు రాసి ఉన్న ఒక టీ వాషింగ్‌ మెషీన్‌లో వేసి జాడించి తర్వాత దాన్ని బయటకు తీశారు. లోపలి నుండి తీసిన “బిజెపి మోడీ వాష్‌’ అనే పేరుతో ఉన్న మరో టీ పత్రికాగోష్ఠిలో పార్టీ ప్రచార విభాగం అధిపతి పవన్‌ ఖేరా మీడియాకు ప్రదర్శించారు. అన్ని రకాల అవినీతికి, మోసాలను తుడిచిపెట్టేవిధంగా ఈ “బిజెపి మోడీ వాష్‌” ఎంతో సమర్థవంంగా పనిచేస్తుందని సెటైర్లు వేశారు. బిజెపి ఇప్పటివరకూ ఈ విధంగా 21 మంది పెద్ద నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆ పార్టీలో చేరాక తుడిచిపెట్టి వారికి క్లీన్‌ చిట్‌ మంజూరు చేసిందని పవన్‌ఖేరా విమర్శించారు. అవినీతిపరులకోసం బిజెపి వాడుతున్న వాషింగ్‌ మెషీన్‌ ఖరీదు 8,500 కోట్ల రూపాయలని ఖేరా విమర్శించారు. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపి దండుకున్న సొమ్ము విలువను వాషిన్‌ మెషీన్‌ ఖరీదుగా పేర్కొంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల బాండ్ల ద్వారా దందాలకు పాల్పడి రూ.8,500 కోట్లు దండుకున్న బిజెపి ప్రతిపక్షాలను ఇక్కట్లకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఈ అవినీతి పరులను తమ పార్టీలోకి చేర్చుకుని క్లీన్‌ చిట్‌ ఇస్తోందని విమర్శలతో ఎండగట్టారు. దర్యాప్తు సంస్థల ద్వారా కేసులు ఎదుర్కొనే నాయకులు బిజెపిలో చేరడం ద్వారా పరిశుద్ధమైన వ్యక్తులుగా మారిపోతున్నారని పవన్‌ ఖేరా విమర్శించారు. ఈ కేసులను బిజెపి మాఫీ చేస్తున్నదని ఆయన అన్నారు. అదేసమయంలో ప్రతిపక్షాలపై కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నదని అన్నారు. ఆదాయపన్నుశాఖ ద్వారా మరోసారి కాంగ్రెస్‌పై వేధింపులు ప్రారంభమైన పూర్వరంగంలో ఆయన ఈ విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలలో నీతి తప్పి వ్యవహరించిన అధికారులందరిపైనా గురి పెడుతుందని హెచ్చరిచారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా, రాజ్యాంగం విలువలను దిగజార్చేవిధంగా ప్రవర్తించిన ప్రతి ఒక్క అధికారిపైనా చర్యలుంటాయని ఆయన పరోక్ష హెచ్చరిక చేశారు.
బిజెపి ఏం సమాధానం చెబుతుంది?
ప్రఫుల్‌ పటేల్‌ అవినీతి పరుడని పదేళ్ళనాడు బిజెపి విమర్శలుచేసిందని పవన్‌ ఖేరా గుర్తు చేశారు. ఎన్‌సిపిని చీల్చుకుని మహారాష్ట్రలోని బిజెపి కూటమిలో చేరిన తర్వాత 2017లో ప్రఫుల్‌ పటేల్‌పై పెట్టిన కేసులు మూసేస్తున్నట్లు సిబిఐ ఒక నివేదిక ప్రకటించింది. 2014 లో బిజెపి విడుదల చేసిన చార్జిషీటులో కూడా పటేల్‌ అవినీతిని ఎండగట్టింది. ఆ తర్వాత ఆయన బిజెపి కూటమిలో చేరారు. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి 2014లో ఒక చార్జిషీటు విడుదల చేసింది. ఎయిర్‌ ఇండియా స్కామ్‌గా దానిని పేర్కొంది. ఈ మొత్తం అవినీతి రూ.30వేల కోట్ల మేరకు ఉంటుందని ఆనాడు బిజెపి ఆరోపించింది. సిబిఐ తన దర్యాప్తులో పటేల్‌ 2006లో కేంద్ర పౌర విమానయానశాఖామంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. ఐదేళ్ళపాటు ఎయిర్‌ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని సిబిఐ పేర్కొంది. 1993లో జరిగిన ముంబయి బాబుపేలుళ్ళ కేసుకు సంబంధించి ఆస్తి వ్యవహారాల్లో పటేల్‌ భాగస్వామిగా ఉన్నారని కూడా బిజెపి ఆరోపించింది. ఈ విషయాలన్నింటినీ పవన్‌ ఖేరా పత్రికాగోష్టిలో మీడియాకు మరోసారి గుర్తుచేశారు. ఆనాడు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ, “మీరు వచ్చి పటేల్‌, ఇగ్బాల్‌ మిర్చిలపై ఉన్న భూమి తాలూకూ ఆరోపణలను తుడిచిపెట్టండి” అని అన్నారని, గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించిన దావూద్‌ ఇబ్రహీంకు ఇబ్రహీం మిర్చి సన్నిహితుడనీ ఆయన గుర్తుచేస్తూ ఈ విధమైన నేరపూరిత ఆరోపణలన్నీ వారి విషయంలో ఏమైపోయాయని, ఈ పరిస్థితులకు బిజెపి ఏం సమాధానం చెబుతుందని పవన్‌ ఖేరా నిలదీశారు. ఆనాడు బిజెపి చేసిన ఆరోపణలన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments