యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ఐటి, గనులశాఖ మంత్రి కెటిఆర్‌
సభ్యుల ఆమోదం తీసుకొని తీర్మానమైనట్లు స్పీకర్‌ ప్రకటన
యురేనియం తవ్వకాలపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌: రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శాసనసభలో సోమవా రం రాష్ట్ర ఐటి, గనులు, పరిశ్రమల శాఖమంత్రి కె.తారకరామారావు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నల్లమల అడువులతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ యురేనియం తవ్వకాలను జరుపవద్దని సభలో మంత్రి కెటిఆర్‌ సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరణ తీర్మానంపై జరిగిన చర్చల్లో కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క, టిఆర్‌ఎస్‌ సభ్యుడు రవీంద్ర కుమార్‌, ఎంఐఎం సభ్యుడు అహ్మద్‌ పాషా ఖాద్రీలు పాల్గొ ని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ నల్లమల జీవవైవిద్యానికి ఆలవాలమన్నారు. ఎన్నో జంతువులు, పశుపక్ష్యాదులు, ఎన్నో వృక్ష జాతులు ఉన్నాయన్నారు. దీంతో పాటు ఈ అడవినే నమ్ముకుని ఈ అడవుల్లోనే జీవిస్తున్న చెంచులు ఉన్నారని చెప్పారు. అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించడానికి కేంద్రం అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇతర ప్రాంతాల్లో అయితే సర్వేకు అనుమతి అవసరం ఉండదన్నారు. అయితే తవ్వకాలకు మాత్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అటవీ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ యురేనియం తవ్వకాలకు అనుమతించడం జరగదన్నారు. యురేనియం తవ్వకాలు, దీని వల్ల వెలుబడే అణుధార్మికతతో పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. ఇలా ప్రవేశపెట్టిన వెంటనే సభ్యుల ఆమోదం తీసుకుని తీర్మానమైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు శ్రీధర్‌బాబు తదితరలు సీట్ల నుంచి లేచి యురేనియం తవ్వకాలపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఆదివారం మీ సభ్యులు భట్టి విక్రమార్క సూచన మేరకే ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఇంకా చర్చ ఎందుకని, తీర్మానం అయిపోయిందని స్పీకర్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ వారు వినకుండా కాసేపు పట్టుబట్టారు. అనంతరం మంత్రి కెటిఆర్‌ వారి వద్దకు వెళ్లి సముదాయించగా, వారు సద్దుమనిగారు.

DO YOU LIKE THIS ARTICLE?