ప్రజాపక్షం/విజయవాడ : పర్యావరణంతోపాటు ప్రజారోగ్యానికి పెనుముప్పు కలిగించే యూరేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సిపిఐ ఎపి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఈ విషయమై ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండు చేసింది. కలిసొచ్చే రాజకీయపార్టీలు, వివిధ సంఘాలతో కలసి అక్టోబరు 6, 7వ తేదీల్లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సమావేశం నిర్ణయించింది. యురేనియం మైనింగ్ కారణంగా గాలి, నీటిని కలుషితమై మనుషులతోపాటు పశుపక్ష్యాదుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని పంటలు, తోటలు సైతం బీడువారిపోతున్నాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై వత్తిడి తీసుకొస్తేనే ఫలితం ఉంటుందని వక్తలు స్పష్టం చేశారు. యురేనియం మైనింగ్‌ను నిలుపుదల చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్హాలులో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయపార్టీల నేతలతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు, బాధితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తుమ్మలపల్లిలో ప్రస్తుతం యురేనియం మైనింగ్ జరుగుతుండగా, కర్నూలుజిల్లా ఆళ్లగడ్డలో బోర్లు వేస్తున్నామనే సాకుతో పొలాల్లో పరీక్షలు నిర్వహించడం దారుణమన్నారు. దీనిపై ఈనెల 6వ తేదీన ఆళ్లగడ్డ ప్రాంతంలో, 7న పులివెందుల ప్రాంతంలో అన్ని రాజకీయపార్టీలు, పలు సంఘాలతో పర్యటించాలని సమావేశం నిర్ణయించిందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఈ ప్రాంతం రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నందున తెలంగాణతో కలసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని రెండు రాష్ట్రాల సమస్యగా ప్రజల్లో తీసుకెళ్లి అవగాహన కల్పించాలని రామకృష్ణ తెలిపారు.
యురేనియం తవ్వకాలు ఆపాలి
RELATED ARTICLES