HomeNewsBreaking Newsయుపి ఎన్నికల్లో తడాఖా చూపిస్తాం

యుపి ఎన్నికల్లో తడాఖా చూపిస్తాం

బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం
ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చలకు వెళతాం
రైతుల మహాపంచాయత్‌లో ఎస్‌కెఎం ప్రకటన
ముజఫర్‌నగర్‌ (ఉత్తరప్రదేశ్‌): వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని, బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. ఆదివారం ఇక్కడ జరిగిన రైతుల మహాపంచాయత్‌కు ఉత్తరప్రదేశ్‌తోపాటు హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా అన్నదాతలు తరలి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని, గిట్టుబాటు ధర (ఎస్‌ఎస్‌పి)ని చట్టబద్ధం చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుమారు పది నెలలుగా ఆందోళనలు జరుపుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలైన ఆందోళనలను చేపడుతున్నది. కీలక నిర్ణయాలను తీసుకునేందుకు మహాపంచాయత్‌లను నిర్వహిస్తున్నది. ముజఫర్‌నగర్‌లో ఎస్‌కెఎం నేతృత్వంలో, సుమారు 30 రైతు సంఘాలు హాజరైన సభలో ఎస్‌కెఎం తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చలకు వెళతామని ప్రకటించింది. సాగు చట్టాల రద్దు అంశంలో తమ వైఖరిన మారబోదని తేల్చిచెప్పింది. వచ్చే ఏడాది యుపితోపాటు మొత్తం ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న అంశాన్ని ప్రస్తావించింది. యుపితోపాటు మిగతా రాష్ట్రాల్లో కూడా బిజెపికి వ్యతిరేకంగా రైతులు ప్రచారం చేస్తారని తెలిపింది. సాగు చట్టాల రద్దు తప్ప మిగతా అంశాలపై చర్చించడానికి, మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించడాన్ని ఎస్‌కెఎం నేతలు తప్పుపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నారు. ఆ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. అలాంటి చట్టాలను తీసుకురావడం అంటే దేశంలో వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేయడమేనని విమర్శించారు. ఈ చట్టాలను రద్దు చేయకుండా కేంద్రం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. చర్చలకు తాముఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని, కానీ, ప్రభుత్వమే సరైన రీతిలో స్పందించడం లేదని విమర్శించారు. సాగు చట్టాల రద్దు కోసం సుమారు పది నెలలుగా ఉద్యమిస్తున్నామని, అది సాధించే వరకూ ఆందోళన కొనసాగుతుందని వారు తేల్చిచెప్పారు. ఈ సభకు లక్షలాదిగా రైతులు తరలిరావడమే వారు సాగు చట్టాలను ఎంతగా వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. మోడీ సర్కారు వెంటనే స్పందించి, సాగు చట్టాలను రద్దు చేసి, తమను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.
వరుణ్‌ గాంధీ మద్దతు…
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చని మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు బిజెపి నేత, పార్లమెంటు సభ్యుడు వరుణ్‌ గాంధీ మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లను తాము గౌరవిస్తామని ఆయన అన్నారు. దేశానికి రైతులే కీలమని పేర్కొన్న ఆయన, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తామని, చర్చలు జరుపుతామని ట్వీట్‌ చేశారు. రైతుల సమస్యలను వారి కోణంలోనే చూసి, తెలుసుకొని, సమీక్షించి, తగిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రైతు గర్జన ఇప్పటికైనా ఆలకించండి : రాహుల్‌
ఉత్తర ప్రదేశ్‌ ముజఫర్‌ నగర్‌లో భారీస్థాయిలో నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌కు కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ మద్దతు తెలియజేశారు. సత్యం గళం విప్పి ప్రశ్నిస్తోందని, ఈ అక్రమ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ గళాన్ని, రైతుల మొరను ఆలకించాలని రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ్రప్రియాంకా గాంధీ వాద్రా కూడా కిసాన్‌ పంచాయత్‌కు తన మద్దతు తెలియజేశారు. రైతు గర్జనల ముందు అధికార అహంకారం ఎంతోకాలం నిలవదని ఆమె హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది రైతులు ఆదివారంనాడు ముజఫర్‌ నగర్‌లో జరిగిన రైతు మహాసభకు హాజరయ్యారు. “దేశాన్ని రక్షించండి” అనే పిలుపుతో ఈ కిసాన్‌ మహాపంచాయత్‌ జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికల కొద్ది నెలల్లోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కిసాన్‌ మహాపంచాయత్‌కు సంయుక్త పిసాన్‌ మోర్చా పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు మేరకు వేలాదిమంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసనగళం వినిపించారు. “సత్యం గొంతెత్తి ప్రతిధ్వనిస్తోంది, ఓ అక్రమ ప్రభుత్వమా! నువ్వు ఆ రైతు ఘోషను ఆలకించాలి” అని రాహుల్‌గాంధీ అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రతిఘటిస్తూ ముజఫర్‌ నగర్‌లోని ప్రభుత్వ ఇంటర్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఈ నిరసన సభ జరిగింది. “రైతులే ఈ దేశానికి గళం. అన్నదాతలే ఈ దేశానికి గర్వకారణం అలాటి రైతుల గర్జనల ముందు అహంకారపూరితమైన అధికారం నిలబడలేదు” అని ప్రియాంకా గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. “ఇప్పుడు యావత్‌ దేశం వ్యవసాయ రంగాన్ని రక్షించుకునేందుకు రైతులు చేసే పోరాటానికి అండగా నిలబడింది, తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రైతులు ఆశిస్తున్నారు, వారికి దక్కాల్సిన దాన్ని వారు కోరుతున్నారు”అని ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ, రైతుల పంటభూములు దోచుకునేవారే రాజద్రోహులు అని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలను సంరక్షించేలా సంయుక్త కిసాన్‌ మోర్చా తన బలాన్ని నిరూపించుకుందని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments