HomeNewsBreaking Newsయుద్ధం ముగించండి

యుద్ధం ముగించండి

శాంతి కోసం చర్చలు కొనసాగించాలి
సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఉక్రేన్‌లో రష్యా సైనిక చర్యను సిపిఐ తీవ్రంగా ఖండించింది. ఉక్రేన్‌లో రష్యన్‌ దళాల చర్యలను ఆపాలని, తక్షణం కాల్పులను విరమించాలని, శాంతిని పునరుద్ధరించాలని, దౌత్యం, చర్చల మార్గానికి తిరిగి రావాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. గత కొన్ని రోజులుగా ఉక్రేన్‌లోని వివిధ ప్రాంతాల్లో రష్యా బలగాల చర్యల వల్ల ప్రాణ, ఆస్తుల నష్టం జరిగిందని తెలియజేసింది. ఈ మేరకు సిపిఐ సెక్రెటేరియట్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా, అమెరికా దాని నాటో మిత్రదేశాలు ఉక్రేన్‌, తూర్పు యూరప్‌లోని దాని భాగస్వాములకు అత్యాధునిక ఆయుధాలను ఎలా పంపాయో, అలాగే రష్యా సరిహద్దులో క్షిపణులను మోహరించడంతో పాటు రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తీవ్రతరం చేసి, శాంతి, సుస్థిరత్వానికి పెను ముప్పును ఎలా సృష్టించాయో ప్రపంచం చూసిందని సిపిఐ తెలియజేసింది. ఈ సైనిక వైరుధ్యాలు రెండు దేశాలకు పరిష్కారాన్ని తీసుకురాలేవని, చమురు, సహజ వాయువు, ముడి పదార్థాల మార్కెట్‌ నియంత్రణ లక్ష్యంగా ఈ ప్రాంతంలో తదుపరి జోక్యానికి అమెరికా దీనిని ‘సాకు‘గా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుందని సిపిఐ భావిస్తుందన్నారు. ‘రష్యా బాల్కనైజేషన్‌’ చేయడం ద్వారా తూర్పు వైపు నాటో మరింత విస్తరించాలనే తమ ఎజెండాను అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, నాటోలు నిలిపివేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. రష్యా భద్రతా సమస్యలను పరిష్కరించాలని, రష్యాపై అన్ని ఏకపక్ష అమానవీయ ఆంక్షలను ఉపసంహరించుకోవాలని, ఉక్రేన్‌, రష్యా రెండూ అంగీకరించిన ‘మినస్క్‌ ఒప్పందం ను గౌరవించాలని సిపిఐ కోరింది. ఉక్రేన్‌ సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రతను సిపిఐ గౌరవిస్తుందని, రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక పొరుగు సంబంధాలను ఆశిస్తోందని స్పష్టం చేసింది. ఇతరుల జోక్యం లేకుండా ప్రస్తుత వివాదాలకు పరిష్కారాలను కనుగొనడానికి రష్యా, ఉక్రేన్‌ ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్న చొరవను సిపిఐ స్వాగతించింది. చర్చల ద్వారా న్యాయమైన, సామరస్యపూర్వకమైన శాంతిని రెండు దేశాలు సాధించగలవని ఆశిస్తున్నట్లు సిపిఐ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments