యాక్టివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్‌…

1,84,523కి చేరిక, మొత్తం కేసుల్లో 1.65 శాతం
దేశంలో కొత్తగా 18,711 మందికి పాజిటివ్‌
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతుంది. వరుసగా రెండవ రోజు కూడా 18 వేలకుపైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. వరుసగా ఐదవ రోజూ యాక్టివ్‌ కేసులు పెరిగాయి. తాజాగా వంద మరణాలు సంభవించాయి.శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,711 కేసులు వెలు గు చూశాయి. క్రితం రోజు కంటే దాదాపు 400 కేసులు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.12,10,799కి పెరిగింది. జనవరి 29న 18,855 కేసులు నమోదు కాగా, ఆ తరువాత నుంచి 18 వేల దిగువకు పడిపోయా యి. మళ్లీ
ఇప్పుడు ఆ స్థాయిలో వెలుగు చూస్తుండడం తీవ్ర కలవర పెడుతుంది. కొత్తగా 100 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,57,756కు పెరిగింది. 24 గంటల్లో 14,392 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీ సంఖ్య 1,08,68,520కి చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 96.65కు పడిపోయింది. క్రితం రోజున 96.68గా ఉంది. గతంలో 97 శాతాన్ని దాటిన రికవరీ రేటు ఇప్పుడు పడిపోవడం గమనార్హం. ఇక మరణాల రేటు 1.41 శాతంగా కొనసాగుతుంది. రోజువారీ కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 1,84,523 యాక్టివ్‌ కేసులు ఉండగా, మొత్తం కేసుల్లో ఆ రేటు 1.65 శాతానికి ఎగబాకింది. దేశంలో ఇప్పటి వరకు 22,14,30,507 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, శనివారం ఒక్కరోజే 37,830 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసిఎంఆర్‌ వెల్లడించింది. కాగా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, గుజరాత్‌ సహా ఆరు రాష్ట్రాల్లో భారీగా కొత్త కేసులు వచ్చాయి. 18,711 మందికి పాజిటివ్‌ వస్తే అందులో ఈ రాష్ట్రాల్లోనే 84.71 నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత కొంత కాలంగా దేశంలోనే అత్యధిక కేసులు రికార్డు అవుతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా 10,187 మందికి కరోనా వచ్చింది. కేరళలో 2,791, పంజాబ్‌లో 1,159 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొత్త కేసులు పెరుగుత్నున నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. మహారాష్ట్ర, పంజాబ్‌కు ఉన్నతస్థాయి నిపుణులతో కూడిన బృందాలను పంపింది. అదే విధంగా కర్నాటక, తమిళనాడులో కూడా రోజువారీ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కొత్తగా 100 మరణాలు సంభవిస్తే అందులో 87 ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 47 మంది, కేరళలో 16, పంజాబ్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారల్లో పది రాష్ట్రాల్లో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు. 12 రాష్ట్రాల్లో ఒకటి నుంచి 10 వరకు సంభవించాయి. అయితే 24 గంటల్లో 19 రాష్ట్రాలు, యుటిల్లో ఒక్కరు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోలేదు.
రెండు కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌
ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరోవైపు భారత్‌లో టీకాల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 3,39,145 సెషన్లలో రెండు కోట్లకుపైగా మంది లబ్ధిదారులకు కరోనా టీకాలు వేశారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 6న ఒక్కరోజే 14 లక్షల మందికిపైగా టీకాలు వేశారు. దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం జనవరి 16వ తేదీన ప్రారంభం కాగా, మొదటగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశారు. ఆ తరువాత ఫిబ్రవరి 2న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాల పంపిణీని ప్రారంభించారు. అయితే మొదటి డోస్‌ వేసుకున్న వారికి రెండవ డోస్‌ను ఫిబ్రవరి 13 నుంచి వేశారు. కాగా, రెండవ విడత టీకా కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి షురూ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?