మే 7 వరకూ లాక్‌డౌన్‌ : మోడీ స‌డ‌లింపులు ఇక్క‌డ చెల్ల‌వ్‌!

పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
ఎలాంటి సడలింపులు ఉండవు
వచ్చే నెల కూడా ఉచిత రేషను, నగదు
స్విగ్గీ, జొమాటోలపై నిషేధం
మత కార్యకలాపాలకు నో పర్మిషన్‌
పోలీసులకు ప్రోత్సాహకాలు
విద్యుత్‌ సిబ్బందికి పూర్తి వేతనాలు
స్కూలు ఫీజులు పెంచితే కఠిన చర్యలు
మూడు నెలలపాటు ఇంటి అద్దె వాయిదాకు ఉత్తర్వులు
నేటి నుంచి కరోనా ప్రత్యేక ఆసుపత్రి సేవలు
వ్యవసాయానికి ప్రోత్సాహం, మే7 తర్వాత అందుబాటులో ఎరువులు
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి, అవసరమైతే డయల్‌ 100
మంత్రివర్గం సమావేశానంతరం ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెల్లడి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారంనాడు దాదాపు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సమావేశానంతరం సిఎం కెసిఆర్‌ పత్రికావిలేకరుల సమావేశంలో మాట్లాడారు. లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించాలని, కేంద్రం ప్రకటించిన సడలింపులు రాష్ట్రంలో ఉండబోవని నిర్ణయించినట్లు ప్రకటించారు. వచ్చే నెల కూడా ఉచితంగా రేషను, నగదు అందజేస్తామని, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ సంస్థలపై నిషేధం విధిస్తున్నామని కెసిఆర్‌ తెలిపారు. కిరాయిదారులు మూడు నెలలపాటు ఇంటి అద్దెలు చెల్లించకుండా వాయిదా వేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెపాపరు. అలాగే కరోనా అదుపులో కృషి చేస్తున్న వైద్యులు, శానిటేషన్‌ సిబ్బందికి ప్రోత్సాహకాలు కొనసాగించడంతోపాటు పోలీసులకు పదిశాతం వేతనం అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్కూలు ఫీజులు పెంచితే కఠిన చర్యలు వుంటాయని, మత కార్యకలాపాలకు మే 7వ తేదీ వరకు అనుమతి వుండబోదని తెలిపారు. సోమవారం నుంచి గచ్చిబౌలిలో 1500 పడకల కరోనా ప్రత్యేక ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని ఏమాత్రం తగ్గించబోమని, 7వ తేదీ ఎరువులు అందుబాటులో వుంటాయని ప్రకటించారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని, సమస్యలు ఏమైనా వుంటే 100కు డయల్‌ చేయాలని కెసిఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కొత్తగా 49 కరోనా పాజిటివ్‌ కేసులు, 21 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 49 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 21 మంది మరణించారు. కేసుల సంఖ్య 858కి పెరిగాయి. ఇంకా 651 మంది చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందుతున్నవారిలో సీరియస్‌ కేసులంటూ ఏమీ లేవని కెసిఆర్‌ చెప్పారు. నాలుగు జిల్లాల్లో జీరో కరోనాకేసులు వున్నాయి. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి, సిద్దిపేటలో కరోనా కేసుల్లేవని చెప్పారు. కేసులు రెట్టింపవుతున్నాయన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వుందని, దేశంలో 8 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతుండగా, మన రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి మరో వారం రోజులు పట్టవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మరణాల శాతం 2.44 మాత్రమే వుందన్నారు. వైద్య పరికరాల కొరత మన రాష్ట్రంలో లేదని వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో పిపిఇ కిట్లు, మాస్కులు వంటి పరికరాలు సిద్ధంగా వున్నాయన్నారు. మందులు కూడా అవసరానికి సరిపడా వున్నాయని చెప్పారు. దాదాపు 42 దేశాలు లాక్‌డౌన్‌లో వున్నాయి. అతి ఎక్కువ ఉన్న దేశాల విషయానికొస్తే, చైనాలోని వుహాన్‌లో 72 రోజులు లాక్‌డౌన్‌ వుందన్నారు. భారత్‌లో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 20వ తర్వాత సడలింపులు ఇవ్వాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. కానీ మన రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ సడలింపులు ఇవ్వరాదని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించిందని కెసిఆర్‌ వెల్లడించారు. మే 1వ తేదీ నాటికి 28 రోజులు పూర్తయిన వారి క్వారంటైన్‌ ముగుస్తుందని చెప్పారు. కేంద్రం సడలింపులు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర పరిస్థితులు దృష్ట్యా ఇక్కడ ఎలాంటి మినహాయింపులు వుండబోవని స్పష్టంచేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలన్నీ యథాతథంగా అమల్లో వుంటాయని తెలిపారు. పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల అమ్మకాలు కొనసాగుతాయని చెప్పారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన మార్గదర్శకాల సూచన మేరకే సడలింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. కరోనా నుంచి బయటపడే పరిస్థితుల్లో నిజాముద్దీన్‌ సమస్య వచ్చిపడిందని, వాటిపై కూడా స్పష్టత వస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం, క్షేమం దృష్ట్యా లాక్‌డౌన్‌ పొడిగించాలని అభిప్రాయ సేకరణలో నిర్ధారణయినందున, వివిధ టీవీల సర్వేలో కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని అభిప్రాయం వచ్చినందున రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని ఇదివరకే నిర్ణయించామని, మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ వుండాలని కేంద్రం పొడిగించిందని, అయితే వివిధ సర్వేలు, ప్రజల కోరిక మేరకు ఈ లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.
మే 5న మంత్రివర్గం
లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించినందున, కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు, ఇతర పరిస్థితులపై చర్చించేందుకు తిరిగి మే 5వ తేదీన మంత్రివర్గం సమావేశమవుతుందని, ఆ సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్‌ చెప్పారు. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు వేరే విధంగా అనుకోకుండా పూర్తిగా సహకరించాలని కోరారు. విమాన ప్రయాణాల కోసం టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని వార్తలు వస్తున్నాయని, అయితే విమాన ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మే 7వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లోగానీ, ఇతర జిల్లాల్లో గానీ రవాణా సౌకర్యాలు వుండవు కాబట్టి, విమానాశ్రయానికి వెళ్లే అవకాశం వుండబోదని, జిఎంఆర్‌ కంపెనీతో కూడా ఈ విషయంపై సమాచారం అందిస్తామని స్పష్టం చేశారు.
స్విగ్గీ, జొమాటోలపై నిషేధం
ఇప్పటి నుంచి మే 7వ తేదీ వరకు స్విగ్గీ, జొమాటోలతోపాటు ఏ ఒక్క ఫుడ్‌ డెలివరీ సంస్థకూ అనుమతి వుండబోదని, వీటిపై పూర్తిగా నిషేధం విధిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. ఈ నెల రోజులూ ఇలాంటి డెలివరీలు లేకపోతే ప్రాణాలు పోవని, సరుకులు తెచ్చుకొని ఇంట్లో వండుకోవాలని సిఎం కోరారు.
మత కార్యకలాపాలకు అనుమతి లేదు
మత సంస్థలకు, మత కార్యకలాపాలకు మే7వ తేదీ వరకు ఎలాంటి అనుమతులు వుండబోవని స్పష్టం చేశారు. మతాలకతీతంగా అందరూ దీనికి సహకరించాలని, అన్యదా భావించవద్దని, రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా ప్రార్థనాస్థలాలు, మత ప్రదేశాలను ఇప్పటికే మూసివేశారని, ఇకముందు కూడా ఇది కొనసాగుతుందని కెసిఆర్‌ వెల్లడించారు. సామూహిక మత కార్యక్రమాలకు అనుమతి ఉండబోదని చెప్పారు.
పోలీసులకు ప్రోత్సాహకం
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు అందిస్తున్న సహకారం గొప్పదని పేర్కొంటూ, విరాళాలు ఇస్తున్న వారందరికీ సిఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తీ అనారోగ్యంతో వుండవద్దని, అలాగే ఆకలితో అలమటించవద్దని, అవసరమైతే 100కు డయల్‌ చేయాలని కోరారు. ఏ ఒక్కరూ ఉపవాసం వుండవద్దని చెప్పారు. కుటుంబ పెన్షనర్లందరికీ 75 శాతం వేతనం అందుతుందని హామీయిచ్చారు. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఏప్రిల్‌ నెలకు కూడా కొనసాగుతాయని చెప్పారు. పోలీసు సిబ్బందికి కూడా ఈసారి పది శాతం వేతనం అదనంగా చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  విద్యుత్‌ రంగంలో ఓఎండి సిబ్బందికి, ఆర్టిసాన్స్‌కు ఈనెల నూటికి నూరు శాతం వేతనం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు.
మూడు నెలలపాటు ఇంటి అద్దె వాయిదా
అలాగే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం, ఇళ్ల కిరాయిదారులు మార్చి, ఏప్రిల్‌, మే నెలలు అంటూ మూడు నెలలపాటు చెల్లించవద్దని, ఇది అప్పీలుకాదని, ఆర్డర్‌ అని చెప్పారు. ఈ మూడు మాసాల అద్దెలను తదుపరి నెలల్లో సర్దుబాటు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని యజమానులను కెసిఆర్‌ ఆదేశించారు. వాయిదా పడిన కిరాయిలపై వడ్డీలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు 2019-2020 సంవత్సరానికి గాను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా 31 వరకు చెల్లించుకోవచ్చని చెప్పారు.
స్కూలు ఫీజులు పెంచితే కఠిన చర్యలు
ప్రైవేటు పాఠశాలలు 2020-2021 విద్యాసంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచకూడదని స్పష్టం చేశారు. రకరకాల ఫీజులేవీ వసూలు చేయరాదని, ట్యూషన్‌ ఫీజు తప్ప ఏ ఒక్క ఇతర ఫీజులేవీ కూడా వసూలు చేయడానికి వీల్లేదని స్కూళ్లకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రజలను ప్రైవేటు స్కూళ్లు యాజమాన్యాలు ఇబ్బంది పెడితే 100కు డయల్‌ చేయాలని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ప్రజలు కష్టపడుతున్నారని, అలాంటి సమయంలో ఇంకా కష్టపెట్టడం సరికాదని, ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వచ్చే నెల కూడా ఉచిత రేషను, నగదు
తెల్లరేషను కార్డు కలిగివున్న ప్రతి వ్యక్తికీ ఈ నెల కూడా 12 కిలోల బియ్యం, అలాగే ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు నగదు సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు కెసిఆర్‌ తెలిపారు. వలస కూలీలకు కూడా గతంలో ఇచ్చినట్లుగానే ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం, అలాగే ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు నగదు సాయం అందిస్తామని చెప్పారు. మే మొదటి వారంలో నగదు అందజేస్తామని తెలిపారు. పారిశ్రామిక సంస్థలు మూసివేసి వున్నందున, వారు విద్యుత్‌ బిల్లులు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు కూడా కట్టాల్సిన పనిలేదని, ఆ తర్వాత పెనాల్టీ లేకుండా భవిష్యత్‌లో వాయిదా పద్ధతిపై కట్టుకోవచ్చని, పాత బిల్లులు కట్టాలనుకుంటే ఒక శాతం రిబేటుతో కట్టుకోవచ్చన్నారు. ఆస్తిపన్నును మే 30వ తేదీ వరకు ఎలాంటి ఆపరాధరుసుం లేకుండానే చెల్లించుకునే సదుపాయం కల్పించామన్నారు.
నేటి నుంచి కరోనా ఆసుపత్రి సేవలు
గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్‌ విలేజ్‌ తరహాలో వున్న 540 గదుల స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ను ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతోపాటు అనుసంధానంగా వున్న భూమిని కూడా హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు బదలాయించడం జరిగిందని తెలిపారు. అక్కడ యుద్ధప్రాతిపదికన 1500 పడకల కోవిడ్‌ 19 స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడం జరిగిందని, అది 20వ తేదీనుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. దీనికి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)గా పేరు పెట్టినట్లు కెసిఆర్‌ ప్రకటించారు. రాష్ట్రానికే ఇదొక గొప్ప వైద్య సదుపాయంగా మారుస్తున్నట్లు చెప్పారు. శామీర్‌పేట, హకీంపేటలలో వున్న స్టేడియాల వద్ద స్పోర్ట్‌ సిటీ ఏర్పాటుకు ఒక మంత్రివర్గం కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. దానికి మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ సారథ్యం వహిస్తారన్నారు.
వ్యవసాయంపై నిర్ణయాలు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం రంగానికి అనేక పథకాలు వర్తింపజేసి, రాష్ట్రంలో ఈ రంగంలో పురోగతి సాధించడం జరిగిందని కెసిఆర్‌ గుర్తుచేశారు. వరిధాన్యం, మొక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు, జొన్నలను కనీస మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిఎం ప్రకటించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ సర్కారే కొంటుందని, ఏ ఒక్క రైతూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు. ప్రాజెక్టులు, బోరు, వర్షాల ఆధారిత ఒక కోటి 35 లక్షల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం వుందని, 21 లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతుందని, భవిష్యత్‌లో ఎలాంటి లోటు లేకుండా ఎరువులు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మే 5వరకు పంటల కొనుగోలు పూర్తయిన తర్వాత అప్పటి నుంచి ఎరువులు బస్తాలు కొనుక్కోవాలని రైతులను కోరారు. పంటలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఎరువుల దుకాణాల వద్ద రద్దీలు లేకుండా రైతులు మే నెలలోనే అవసరమైన ఎరువులను కొనుక్కోవాలని సూచించారు. మే 7 తర్వాత కూడా వివాహాలు, ఫంక్షలు, వేడుకలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆ సమయంలో ఎరువుల నిల్వ కోసం ఈ ఫంక్షన్‌ హాళ్లను తాత్కాలిక గోదాముల కింద ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ప్రజలకు విజ్ఞప్తి
కరోనా వ్యాధి తగ్గడం లేదని, ప్రమాదకరస్థాయికి చేరే అవకాశం వుందని సిఎం కెసిఆర్‌ తెలిపారు. అందువల్ల ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావద్దని, అవసరమైతే తప్ప రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా అవసరమైతే, 100కు డయల్‌ చేయాలని, ప్రభుత్వం మీ కష్టాలను తొలగించడానికి కృషి చేస్తుందని చెప్పారు. కరోనాకు మందు లేదని, ఉపశమనాలకు మందులు మాత్రమే వున్నాయని, అందువల్ల సామాజిక దూరమే దీనికి మందు అని గ్రహించాలని కోరారు. 130 కోట్ల ప్రజలకు ఆహారాన్ని ఇచ్చే వ్యవసాయం, సంబంధిత పరిశ్రమలకు తప్ప ఇంకేదేనికీ మినహాయింపులు వుండబోవని చెప్పారు. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దేశ విత్తవిధానం కేంద్ర ఆధీనంలో వుందని, రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎంను పెంచాలని ప్రధానిని కోరినట్లు కెసిఆర్‌ చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?