దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని మోడీ
ఏప్రిల్ 20 నుంచి అత్యవసరాలకు అనుమతులు
హాట్‌స్పాట్ రహిత ప్రాంతాల్లోనే సడలింపులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. లాక్డౌన్ ఏప్రిల్ 14 నాటితో ముగిసిన నేపథ్యంలో కొత్తగా ఆంక్షలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోడీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి 25 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనాపై భారతదేశ యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతున్నదని, ఈ యుద్ధంలో ప్రతి పౌరుడూ పాల్గొని తన వంతు కృషి చేస్తున్నారని మోడీ అన్నారు. ఇప్పటివరకు ప్రజలంతా ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా కదనరంగంలోనే వున్నారని తెలిపారు. దేశం కోసం ప్రజలంతా ఇదే స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. ఇక నుంచి అదనంగా ఒక్క వ్యక్తికి కూడా కరోనా సోకకూడదని, ఒక హాట్‌స్పాట్ కూడా పెరగకూడదని, నిబంధనలను కఠినంగా పాటించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు పేదలు, కూలీలు ఎన్నో కష్టాలు పడ్డారని, వారికి కళ్యాన్ యోజన పథకం కింద తోడ్పాటునందిస్తామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కోరారు. ఎప్పటిలాగానే ప్రతి పౌరుడూ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌కు సహకరించాలని మోడీ పిలుపునిచ్చారు. వుయ్ ద పీపుల్ అనే నినాదాన్ని సార్థకం చేయడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సంకల్ప శక్తిని ద్విగణీకృతం చేసుకొని, కరోనాపై పోరును నిబద్ధతతో కొనసాగించిననాడే అంబేద్కర్‌కు ఇచ్చిన నిజమైన ఘన నివాళి అవుతుందని మోడీ అన్నారు. మొదటి దశ పరీక్షలో ప్రజలంతా ఎంతో శ్రమించి నిలబడ్డారని, ఇప్పుడు రెండో దశ పరీక్ష వచ్చిందని, ఈ పరీక్షలోనూ జనం మరింత ద్విగిణీకృతంగా పనిచేయాలని మోడీ కోరారు. మే 20వ నుంచి అత్యవసర అనుమతులు ఇస్తామని, అయితే నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. 20వ తేదీన కొన్ని రకాల సడలింపులు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలంతా ఏడు సూత్రాలు కఠినంగా పాటించాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను కఠినంగ పాటించాలని, ఆయుష్ శాఖ నిబంధనలు పాటించాలని, ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంట్లో పెద్దవారిని బాగా చూసుకోవాలని, కరోనా యోధులైన వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి గౌరవం ఇవ్వాలని, పేదలకు చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. లాక్డౌన్ వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. అయినా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ ఓర్పు, సహనం వహించారని.. దేశం కోసం సైనికుల్లా పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని భారత ప్రజలమైన మేము అన్న స్ఫూర్తిని చాటారని కొనియాడారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేడ్కర్‌కు గొప్ప నివాళి అని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాదాసీదాగా జరపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు
“దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారేవి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే. ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో ప్రజల కష్టాల్ని ఎలా తగ్గించాలి.. తీవ్రతను కనిష్ఠానికి ఎలా పరిమితం చేయాలని నిరంతరం రాష్ట్రాలతో చర్చించి పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రతి అంచెలో వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకే లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. వైరస్ మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఇప్పటికే వైరస్ హాట్‌స్పాట్‌గా ఉన్న ప్రాంతాలపై నిఘా మరింత పటిష్ఠం చేయాలి. మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. కొత్త హాట్స్పాట్లు పుట్టుకొస్తే మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమై కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 20 వరకు కఠిన ఆంక్షలు తప్పవు. ఆ తర్వాత వైరస్ తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాలకు షరతులు ఆధారంగా కొన్ని మినహాయింపులు ఇస్తాం. అయితే, వాటిని ఉల్లంఘించినట్లు తెలిస్తే మినహాయింపులను ఉపసంహరిస్తాం. లాక్డౌన్ పూర్తి మార్గర్శకాలను రేపు విడుదల చేస్తాం. దినసరి కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి. రబీ సీజన్ పంట కోతల సమయం వచ్చింది. రైతుల కష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటాం. వైద్యారోగ్య పరిస్థితుల్ని మెరుగుపడ్డాయి. కొత్త వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ఆస్పత్రుల పడకల సామర్థ్యాన్ని పెంచాం. కొత్తగా 600 ఆస్పత్రులు కరోనా చికిత్సకోసం పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తల్ని ప్రోత్సహిస్తున్నాం. ఈనెల 11న ముఖ్యమంత్రులతో సమావేశం సందర్భంగా ప్రాణంతో పాటు ప్రపంచమూ ముఖ్యమే” అని ప్రధాని తెలిపారు. కాగా, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి, మిజోరం వంటి రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. మోడీ తాజా ప్రకటనతో ఆ రాష్ట్రాల్లోనూ మరో మూడు రోజులు అదనంగా లాక్డౌన్ కొనసాగుతుంది.
ప్రధానమంత్రి సూచించిన సప్తసూత్రాలు
కరోనాపై విజయం సాధించడానికి ప్రతి పౌరుడు ఏడు సూత్రాలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. అవేమిటంటే,
1. వృద్ధులకు బాసటగా నిలవండి, వారి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోండి.
2. కరోనాపై పూర్తి సమాచారం అందించే ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి.
3. కరోనాతో ఎక్కువగా నష్టపోయిన కూలీలు, పేదలకు చేయగలిగినంత మేరకు సాయం చేయండి.
4. కరోనా కట్టడికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందిని గౌరవించండి.
5. తోటి ఉద్యోగులకు అండగా నిలిచి, వారిలో ఉద్యోగ భద్రత పట్ల భయాన్ని పోగొట్టండి.
6. సామాజిక, భౌతికదూరం తప్పనిసరి, మాస్కులును విధిగా ధరించండి.
7. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి. ఆయుష్ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించండి.