మేడం టుస్సాడ్‌లో శ్రీదేవి విగ్రహం

అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని ఇంకా సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెను మరిపించే మరో నటి భారత చిత్ర పరిశ్రమలో లేరంటే అతిశయోక్తి కాదు.ఆగా, ఈ లేడీ సూపర్‌స్టార్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఇప్పటికే మేడం టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగించే వార్తను ఆ సంస్థ అందించింది. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న వారందరి ఎదురుచూపులకు తెరదించుతూ.. బుధవారం శ్రీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుందని ప్రకటించింది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ”శ్రీదేవి మా హృదయంలోనే గాక, కోట్లాది మంది గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది. మేడం టుస్సాడ్స్‌లో ఆమె విగ్రహావిష్కరణ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం” అని బోనీ కపూర్‌ అన్నారు. అలాగే విగ్రహావిష్కరణకు సంబంధించిన ఓ చిన్న ప్రోమోను జత చేశారు. ఆ వీడియోలో బంగారు వర్ణపు వస్త్రాలు ధరించిన శ్రీదేవి విగ్రహానికి కిరీటం మరింత అందాన్ని చేకూర్చుతోంది. పెదాలు, కళ్లు సజీవ శిల్పాన్ని తలపిస్తున్నాయి. ఆమె సూపర్‌ హిట్‌ చిత్రం ’మిస్టర్‌ ఇండియా’లోని ’హవా హవాయి’ లుక్‌ ఆధారంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. శ్రీదేని మరణం తర్వాత ఆమెను బాగా మిస్సవుతున్న అభిమానులకిదీ ఆనందకరమైన వార్త.

DO YOU LIKE THIS ARTICLE?