కెఆర్‌ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ
శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటాం
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కెఆర్‌ఎంబి పరిధిలోనికి తీసుకొచ్చేందుకు తాము అంగీకరించలేదని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కెఆర్‌ఎబి అంశంలో శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బిఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో నీటి కేటాయింపులలో చుక్క నీటిని కూడా అదనంగా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఎవ్వరూ ఉహించని రీతిలో బిఆర్‌ఎస్ పాలనలో ఏ ప్రాజెక్ట్ చూసినా పైసల కోసమే ప్రాజెక్ట్‌లను చేపట్టారు కానీ నీటి కోసం కాదని విమర్శించారు. ప్రాజెక్ట్‌లలో జరిగిన అవినీతిపైన చట్టం ప్రకారం చర్యలు తప్పవని, ఇందులో ప్రమేయం ఉన్న ఏ రాజకీయ నాయకుడు, అధికారులను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్ట్‌లను కెఆర్‌ఎంబికి అప్పగిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పడం పచ్చి అబద్దమన్నారు. ఢిల్లీలోజరిగిన చర్చలో ఉమ్మడి ప్రాజెక్ట్‌లను తమ పరిధిలో ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించిందని, అందుకు తాము అంగీకరించలేదని వివరించారు. కృష్ణ నీటి గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు. కృష్ణా నీరు వాటా తగ్గిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అని అన్నారు. శ్రీశైలం వెనకాల నుండి లిఫ్ట్‌లు నిర్మించి, అక్కడి నీటిని ఎపి ప్రభుత్వం రాయలసీమకు తీసుకెళ్తుంటే నాటి సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు ఎందుకు మాట్లాడలేదని, పైగా ఎపి సిఎం జగన్‌తో అలాయ్‌బలాయ్ చేసుకున్నారన్నారు. సంగమేశ్వర ప్రాజెక్ట్ పై కెసిఆర్, హరీశ్‌రావు ఎందుకు మాట్లాడలేదన్నారు. వారు అబద్ధాలు మాట్లాడడం తప్ప మరోటి లేదన్నారు.
తాగునీటి కోసం త్వరలోనే కర్నాటక
హైదరాబాద్ తాగునీటి నిమిత్తం సిఎం ఆధ్వర్యంలో తాము త్వరలోనే కర్నాటక ముఖ్యమంత్రిని కలిసి పది టిఎంఎసిల నీటిని విడుదల చేయాలని కోరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతరామ ప్రాజెక్ట్ భారీ కుంభకోణం జరిగిందని, స్వతంత్ర కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపింఆరు. రాష్ట్రంలో అముల్యుమైన సంపదను బిఆర్‌ఎస్ దోపిడీకి గురిచేసిందన్నారు. నాటి సిఎం కెసిఆర్ 10.5 నుండి 11 శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చారని, తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ శాఖకు సుమారు రూ. 18వేల కోట్లు వడ్డీని, రుణాలు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. రోజువారిగా సమీక్షలు, వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిర్ఘాంతపోతున్నామని, అముల్యమైన ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ హోదా ప్రాజెక్ట్ అనే స్కీమే కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని, సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ చెప్పారన్నారు. ఇదే విషయాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెప్పినట్టు కేంద్రమంత్రి తమతో చెప్పారని ఉత్తమ్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ నిమిత్తం కూడా తగిన ఫార్మెట్‌లో దరఖాస్తు పెట్టలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని ఉత్తమ్ తెలిపారు. పాలమూరు పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించామని, అందుకు ఆయన స్పందిస్తూ మరో కొత్త స్కీమ్‌లో భాగంగా పాలమూరురంగారెడ్డి ప్రాజెక్ట్ కు సంబంధించిన దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించినట్టు ఆయన పేర్కొన్నారు.