విభజన హామీలపై రాజ్‌భవన్ దృష్టిపెట్టాలి : మంత్రి హరీశ్‌రావు
వైద్య కళాశాల దరఖాస్తులో తెలంగాణ వైఫల్యం : గవర్నర్ తమిళిసై
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వైద్య కళాశాల కేటాయింపు అంశంపై ట్విట్టర్ వేదికగా చర్చకు దారితీసింది. ఒక నైటిజన్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పిన సమాధానంపై వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. వైద్య కళాశాల కేటాయింపు వ్యవహార శైలిలో కేంద్రం తీరును తప్పుపట్టారు. రాజ్‌భవన్ తన దృష్టిని విభజనహామీలపై పెట్టి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితీసుకొస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని ఎందుకు తప్పుపట్టడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు కేటాయించారని ఒక నైటిజన్ గవర్నర్
తమిళిసై సౌందర రాజన్‌ను ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇందుకు గవర్నర్ తమిళిసై స్పందిస్తూ ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్షా యోజన కింద అన్ని రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నాయని, ఆ సమయంలో సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ విఫలమైందన్నారు. ఇదే క్రమంలో ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు తమిళనాడుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని , ఆ తర్వాత వైద్యకళాశాలను కేటాయించాలని అడుగుతున్నారని ఎద్దేవా చేసింది.దీనిపై రెడ్కో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి తీవ్రంగానే స్పందించారు. గవర్నర్ ట్విట్లను రీ పోస్ట్ చేసిన సతీశ్‌రెడ్డి, గవర్నర్‌ను ట్విటర్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సంబోధించారు. వైద్య కళాశాల కేటాయింపు అంశంలో గవర్నర్ వ్యాఖ్యలు కేవలం ప్రచారం మాత్రమేనని, గవర్నర్ లాంటి అత్యున్నత స్థానంలో కొనసాగే అర్హత తమిళి సైకి లేదని ట్విట్ చేశారు.
విభజన హామీలపై ‘రాజ్‌భవన్’ దృష్టి పెడితే ఉపయోగం
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ సమాధానంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. వరుసగా ట్విట్లను పోస్ట్ చేశారు. రాజ్‌భవన్ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ఖీరణ చట్టంలోని హామీలైన గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, రైల్వే కోచ్‌పై దృష్టిపెడితే తెలంగాణ ప్రజలకే మేలు జరుగుతుందని సూచించారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి వైద్య కళాశాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కోరినా ఒక్క కళాశాలను కూడా కేటాయించలేదని తెలిపారు. ప్రస్తుత బిజెపి ఎంఎల్ఎ, అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా వైద్య కళాశాలను కేటాయించాలని కేంద్రాన్ని కోరారని, కేంద్రం కూడా సానుకూలంగా ఉందని ప్రకటించిన వీడియోను హరీశ్‌రావు జత చేశారు. ప్రస్తుతం కళాశాల కేటాయింపుల అంశంలో కేంద్ర మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని హరీశ్‌రావు ట్యాగ్ చేశారు. దేశంలోనే ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ అగ్ర స్థానంలో ఉన్నదని, జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసున్నట్లు వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధుల కొరత ఉన్నదని, దేశవ్యాప్తంగా ఎయిమ్స్ అభివృద్ధికి రూ.1365 కోట్లు కేటాయిస్తే, ఇందులో కేవలం రూ.156 కోట్లు మాత్రమే తెలంగాణకు మంజూరు చేసేందుకు కారణం ఏమిటని ప్రశ్నించారు. గుజరాత్ ఎయిమ్స్‌కు 52 శాతం, తెలంగాణ 11.4 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా నిమ్స్ ఆస్పత్రులకు కేంద్రం కేటాయించిన నిధులజాబితాను కూడా మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మెడికల్ కాలేజీల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం
RELATED ARTICLES