మెట్రోరైల్‌ కారిడార్‌-2కు లైన్‌ క్లియర్‌

సేఫ్టీసర్టిఫికెట్‌ ఇచ్చిన సిఎంఆర్‌ఎస్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కారిడార్‌-2 త్వరలోనే అందుబాటులోకి రానుంది. మెట్రోరైల్‌ ప్రయాణికుల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అత్యంత కీలకమైన ఘట్టం పూర్తి చేసుకుంది. మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజిబిఎస్‌)-జూబ్లీబస్‌ స్టేషన్‌(జెబిఎస్‌) కారిడార్‌-2 రైల్‌ సేఫ్టీ(సిఎంఆర్‌ఎస్‌) సర్టిఫికెట్‌ జారీ అయ్యింది. సిఎంఆర్‌ఎస్‌ కమిషనర్‌ జె.కె.గార్గ్‌ ఆదివారం ఎంజిబిఎస్‌-జెబిఎస్‌ కారిడార్‌-2ను పరిశీలించారు. ఇప్పటికే ఈ కారిడార్‌ పనులు పూర్తి కావడంతో ట్రయల్న్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. కారిడార్‌ను ప్రారంభించేందుకు సిఎంఆర్‌ఎస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సేప్టీ పరీక్షల అనంతరం కారిడార్‌పై సిఎంఆర్‌ఎస్‌ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిందని మెట్రోరైల్‌ ఎం.డి.ఎన్‌విఎస్‌రెడ్డి వెల్లడించారు. కారిడార్‌కు సంబంధించి వయాడక్ట్‌, ట్రాక్‌, సిగ్నలింగ్‌, టెలికం, ట్రెయిన్స్‌, ఎలక్ట్రిక్‌, ట్రాక్షన్‌సిస్టమ్‌ను సిఎంఆర్‌ఎస్‌ నిపుణులు పరిశీలించారు. ట్రెయిన్‌కు సంబంధించి స్పీడ్‌ మెయింటెన్స్‌ను, స్టేషన్‌ స్ట్రక్చర్స్‌, లిప్ట్‌, ఎస్కలేటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్‌లను, టికెటింగ్‌ విధానం, కంట్రోల్‌రూం, ప్యాసింజర్స్‌కు అవసరమైన సౌకార్యాలను కూడా అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని ఎన్‌విఎస్‌రెడ్డి వివరించారు. ఈ పరిశీలనలో సిఎంఆర్‌ఎస్‌ అధికారుల వెంట ఎన్‌విఎస్‌రెడ్డితో పాటు ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు. ఎంజిబిఎస్‌-జెబిఎస్‌ కారిడార్‌ 11 కిలోమీటర్లు కాగా ఈ మార్గంలో 9 స్టేషన్‌లు ఉన్నాయి. ఎంజిబిఎస్‌, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌, ముషీరాబాద్‌, గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌ వెస్ట్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, జెబిఎస్‌ స్టేషన్‌లు ఉన్నాయి. సిఎంఆర్‌ఎస్‌ సేప్టీసర్టిఫికెట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ కారిడార్‌ను ఎప్పుడు ప్రారంభించాలన్నది త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుందని ఎన్‌విఎస్‌రెడ్డి చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?