11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కొలువుల జాతర ఆరంభమైంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ‘మెగా డిఎస్సి’ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం విడుదల చేశారు. పరీక్షల తేదీని ప్రకటించనప్పటికీ మార్చి 4 నుండి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, 727 భాషా పండితులు, 182 పిఇటి, 6,508 ఎస్జిటి, ప్రత్యేక కేటగిరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్ఇటి 796 పోస్టులను భర్తీ చేయనుంది. జులై 1వ తేదీ 2023 నాటికి 18 ఏళ్లు పూర్తి అయి 46 ఏళ్లు లోపు ఉన్నవారు డిఎస్సి రాసేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలు, ఎక్స్సర్వీస్మెన్స్కు మూడు సంవత్సరాలు, ఎస్సి, ఎస్టి, బిసి, ఇడబ్ల్యుస్కు చెందిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, శారీరక దివ్యాగులైన వారికి లు పది సంవత్సరాల వయసు మినహాయింపును కలిపించారు. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలి. దరఖాస్తు రుసుము రూ.1000లుగా నిర్ణయించారు. ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి కేంద్రాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెగా డిఎస్సి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
‘మెగా డిఎస్సి’ నోటిఫికేషన్
RELATED ARTICLES