హెలికాప్టర్ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్‌సింగ్ మృతి
రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి సంతాపం
న్యూఢిల్లీ : తమిళనాడు నీలగిరి కొండల్లో ఈ నెల 8వ తేదీన జరిగిన వాయుసేన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి బెం గళూరు సైనిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన వాయుసేన యుద్ధ వీరుడు, శౌర్యచక్ర’ గ్రహీత గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (39) బుధవారం తుదిశ్వాస విడిచారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్‌లో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి ఇన్నాళ్ళూ చికిత్సపొందిన ఏకైక సైనికుడు ఆయనే. ఆయన మరణంతో ఇక ఆ హెలికాప్టర్‌లో ప్రయాణించినవారంతా మృతుల జాబితాలో చేరారు. వరుణ్‌సింగ్ డిసెంబరు 8న సూలూర్‌లోని వైమానిక స్థావరంలో జనరల్ బిపిన్ రావత్‌కు స్వాగతం పలికి ఆయనతో కలిసి వెల్లింగ్టన్ శిక్షణా కేంద్రానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. జనరల్ రావత్ వెల్లింగ్టన్‌లోని రక్షణ కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యేందుకు వెళుతుండగా పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఎంతో దిటవుగుండె గల గ్రూప్ కమాండర్‌గా పేరొందిన వరుణ్ సింగ్ బుధవారం ఉదయం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూశారని వాయుసేన అధికారులు తెలియజేశారు. ఆయన మృతికి వాయుసేన తీవ్ర సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి వాయుసేన అండదండగా నిలబడుతుందని వాయుసేన విభాగం ట్విట్టర్ సందేశంలో పేర్కొంది. ఆయన సేవలు గుర్తించిన దేశం గడచిన ఆగస్టు నెలలోనే ఆయనకు శౌర్యచక్ర అవార్డు ఇచ్చి సత్కరించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సైనిక కుటుంబంలో జన్మించిన వరుణ్‌సింగ్ తొలుత ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలో కొంతకాలం గడిపారు. తర్వాత తండ్రి వృత్తిరీత్యా హర్యానాకు కుటుంబంతో తరలివెళ్ళారు. అక్కడే చాందిమందిర్ కంటోన్మెంట్ ఆర్మీ పబ్లిక్‌స్కూలులో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయనకు భార్య, 11 ఏళ్ళ కుమారుడు, ఎనిమిదేళ్ళ వయసుగల కుమార్తె ఉన్నారు. ఆయన అత్యద్భుతమైన టెస్ట్ పైలెట్. ఆయన ఆరు నెలలపాటు ‘తేజస్’స్వాడ్రన్‌గా ప్రతిష్టాత్మకమైన సంస్థలో బోధకుడుగా పనిచేశారు. ఆయన తండ్రి కెపి సింగ్ కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌లో ఆయన పనిచేశారు. వరుణ్‌సింగ్ కుటుంబం ప్రస్తుతం భోపాల్‌లో నివసిస్తోంది. తొలుత హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే డిసెంబరు 8న ఆయనను వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యుల ఆశయాలమేరకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆ వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
రాష్ట్రపతి సంతాపం
వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ మరణంపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వాయుసేన యుద్ధ వీరుడుగా ఆయన దేశానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. మనుగడకోసం మృత్యువుతో తుదిశ్వాస వరకూ వరుణ్‌సింగ్ పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చాలా ఎక్కువగా గాయపడ్డారని, అయినప్పటికీ తుదివరకూ ఒక గొప్ప యుద్ధవీరుడుగా ధైర్యసాహసాలు ప్రదర్శించారని రాష్ట్రపతి తన సందేశంలో కొనియాడారు. భారతజాతి ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రధాని, రక్షణమంత్రి ప్రగాఢ సానుభూతి
వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ మరణంపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యసాహసాలుగల కెప్టెన్‌గా వాయుసేనకు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని ఆయన తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జాతికి ఆయన అందించిన సంపద్వంతమైన సేవలను దేశం ఎన్నటికీ మరచిపోలేదన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. వరుణ్‌సింగ్ మరణం పట్ల రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. గొప్ప ఫ్లయింగ్ స్కిల్స్‌ను పుణికిపుచ్చుకున్న వాయుసేన వీరుడుగా ఆయనను కొనియాడారు. జీవితంలో ఆయన ఎన్నో అవాంతరాలను ప్రతిఘటించారని, అత్యద్భుతమైన శక్తిసామర్థ్యాలను వృత్తిలో ప్రదర్శించారని, ఆయన వృత్తి నైపుణ్యంతో, నియంత్రణా శక్తితో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతోపాటు వందలకోట్లను ఆ రూపేణా పొదుపు చేయగ ల సమర్థుడని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన ఎప్పుడూ సమయాలు పాటించేవారు కాదని వాయుసేన నివాళులు అర్పించింది. ఎప్పుడూ ఆయన అందుబాటులో ఉంటూ ఉండేవారని పేర్కొంది. దేశీయంగా రూపొందించిన యుద్ధ విమానాల్లో ఉన్న లోపాలను ఖచ్చితంగా అంచనావేసి చెప్పగల దిట్టగా ఆయనను కొనియాడారు.
మృత్యువుతో పోరాడి.. ఓటమి
RELATED ARTICLES